
అధనపు అంతస్తులు!
అనుమతులు లేకున్నా అధికారుల కనుసన్నల్లోనే నిర్మాణాలు రేటు కట్టి మరీ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు రోడ్ల కింద యూఎల్‌సీ భూములపైనా కన్ను
యూఎల్‌సీకి ఇచ్చిన భూములను సైతం..
ఆ వ్యక్తి మధ్యవర్తిగా..!
విజయవాడ వన్‌టౌన్‌లో అడ్డగోలుగా నిర్మాణం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ వన్‌టౌన్ అక్రమ భవన నిర్మాణాలకు అడ్డాగా మారుతోంది. ప్లాన్ ప్రకారం నిర్మాణాలు జరగటం లేదు. అనుమతి లేని అదనపు అంతస్తులు పైకి ఎగబాకుతున్నాయి. భవన నిర్మాణాల్లో డీవియేషన్‌లు అధికంగా ఉన్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల కనుసన్నల్లోనే పెద్ద ఎత్తున అక్రమ కట్టడాల నిర్మాణాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఖరీదైన ప్రాంతం..
వన్‌టౌన్ ప్రాంతం ఇరుకుగా ఉండటం, ఎక్కువగా వాణిజ్య సముదాయాలు ఉండటంతో అక్కడ స్థలాల ధర భారీగా ఉంటుంది. బిల్డింగ్ మొత్తం చిన్నదైన రూ.కోట్లల్లో ధర పలుకుతుంది. దీంతో పార్కింగ్ ప్రాంతాన్ని సైతం షాప్స్, గోడౌన్‌లుగా వాడుతారు. జీప్లస్–2 భవన నిర్మాణానికి అనుమతి తీసుకొని అదనంగా ఫ్లోర్‌లు నిర్మిస్తున్నారు.
ఇవిగో కొన్ని ఉదాహరణలు..
ఉపేక్షిస్తే కష్టం..
వన్‌టౌన్ ప్రాంతాన్ని పరిశీలిస్తే ఇలాంటి భవనాలు పెద్ద సంఖ్యలో కనిపిస్తాయి. ఉన్నతాధికారులు దృష్టి సారించి, ఇలాంటి భవనాలను ఎన్ని ఉన్నా యో సర్వే చేసి, కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ఇలాంటి నిర్మాణాలను ఉపేక్షిస్తే, పార్కింగ్ సమస్యలు తలెత్తడంతోపాటు, రోడ్లపైనే వాహనాలు నిలుపుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడతాయి. వర్షం వస్తే నీరు బయటకు పోయే దారి లేక రోడ్లపైన నిలుస్తుంది.
రోడ్ల కింద అర్బన్ ల్యాండ్ సీలింగ్(యూఎల్ సీ) కింద ఇచ్చిన భూములను సైతం తిరిగి తప్పుడు రికార్డులతో కొంత మంది సబ్ రిజిస్ట్రార్‌ల సహకారంతో రిజిస్ట్రేషన్ చేసి, ప్లాన్‌లో కలుపుకొని ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతున్నారు. ప్రభుత్వానికి డబ్బు చెల్లించి కొనుగోలు చేస్తే రూ.14కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకూ ఆదాయం వచ్చే స్థలాలు ఉన్నాయి. అయితే యూల్‌ఎసీ అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇలా రూ.కోట్ల విలువైన యూల్‌ఏసీ భూములు భవానీపురం, గొల్లపూడి, పటమట, సింగ్‌నగర్, నున్న.. చుట్టు పక్కల ఉన్నాయి. వీటిపైన రెవెన్యూ శాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
వన్ టౌన్ ప్రాంతంలో అడ్డగోలు నిర్మాణాలు చేపడుతున్నా అడ్డుకట్ట వేయటంలో అధికారులు విఫలం అవుతున్నారు. ప్రధానంగా నగర పాలక సంస్థ ముఖ్య అధికారి పర్యవేక్షణ కొరవడటంతోపాటు కొందరు పైస్థాయి అధికారులే క్షేత్ర స్థాయిలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అదనపు అంతస్తుల నిర్మాణం చేసుకొనేందుకు రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలకు సెట్‌బ్యాక్, భారీగా డీవియేషన్‌లు ఉన్నా పట్టించుకోకుండా మమ అనిపిస్తున్నారు. ఇలాంటి కొన్ని వ్యవహారాలను నగరంలో ఎలక్ట్రానిక్ వస్తువులను రిపేరు చేసే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ చక్కబెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అనధికార కట్టడాలను ప్రారంభంలోనే గుర్తించడంతోపాటు ఆయా నిర్మాణాలు చేపట్టిన వారిపై చార్జిషీట్ వేసేలా చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నారు. భవన అనుమతుల్లో నిబంధనలు అతిక్రమిస్తే వేటు తప్పదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న కొంత మంది సిబ్బంది పెడ చెవిన పెడుతున్నారు. గతంలో ఏసీబీ దాడుల్లో వెలుగు చూసిన అవకతవకలను సరిచేసేందుకు నగరపాలక సంస్థ అధికారులు చేపట్టిన చర్యలు ముందుకు సాగటం లేదు. చీఫ్ సిటీ ప్లానర్ టౌన్ ప్లానింగ్ సిబ్బందికితో సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేస్తున్నా, క్షేత్ర స్థాయిలో సిబ్బందిలో మార్పు కనిపించటం లేదు. భవనాల అనుమతుల్లో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అనుమతుల్లో టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలను తుంగలో తొక్కుతూనే ఉన్నారు.

అధనపు అంతస్తులు!