
ఘనంగా ఉరుసు మహోత్సవం
భవానీపురం(విజయవాడపశ్చిమ): స్థానిక స్వాతీ సెంటర్‌లోని బాబాజీ హజరత్ సయ్యద్ అమీనుద్దీన్ చిష్తి ఔలియా దర్గా 41వ ఉరుసు (గంధం) మహోత్సవం ఘనంగా జరిగింది. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం సాయంత్రం 6 గంటలకు భవానీపురంలోని బాబా దర్గా నుంచి గంధం తీసుకుని వాహనంలో ఊరేగింపుగా బయలుదేరింది. ప్రకాశం బ్యారేజి, కాళేశ్వరరావు మార్కెట్ మీదుగా బాబా దేవుని ధ్యానం చేసిన ప్రదేశానికి (రైల్వే స్టేషన్ వెస్ట్ వైపు గల షాజహూర్ ముసాఫిర్ ఖానాలోని షాప్ నంబర్ 9) చేరుకుంది. తిరిగి అక్కడి నుంచి బయలుదేరి సొరంగం మీదుగా రాత్రి 9 గంటలకు బాబా దర్గాకు చేరుకుంది. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చిన సంధల్(గంధం)ను బాబా దర్బార్‌పైకి ఎక్కించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేత వెలంపల్లి శ్రీనివాసరావు దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయనతోపాటు కార్పొరేటర్ శిరంశెట్టి పూర్ణ, పార్టీ నాయకులు ఎస్‌కే నజీర్, అబ్దుల్ రెహమాన్, ఎండీ గౌసీ, షేక్ నయీం, ఎస్‌కే కలీం తదితరులు ఉన్నారు. కాగా దర్గా సజ్జాదె నషీన్, ప్రభుత్వ ఖాజీ సయ్యద్ షా మొహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ చిష్తి మాట్లాడుతూ ఉరుసు ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు సోమవారం చిరాగ (దీపారాధన), సాయంత్రం ప్రసాదం పంపిణీ జరుగుతుందని తెలిపారు. రాత్రి 9 గంటలకు బాబాను కీర్తిస్తూ భక్తి గీతాలతోకూడిన ఖవ్వాలీ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పారు.