
ఎరువులు పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఎరువులు పక్కదారి పడితే కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం కలెక్టర్ లక్ష్మీశ.. వ్యవసాయ, సహకార, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కొరత అనే మాటకు ఆస్కారం లేకుండా సమృద్ధిగా ఉన్నాయన్నారు. పక్కదారి పట్టకుండా, ప్రతి రైతుకూ న్యాయబద్ధంగా ఎరువులు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 6,388టన్నుల యూరియాతో పాటు డీఏపీ, ఎంవోపీ, ఎస్‌ఎస్‌పీ కాంప్లెక్స్.. ఇలా మొత్తం 23,820 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకే ఎరువులను సరైన విధంగా వినియోగించాలని, అవసరానికి మించి తీసుకోకుండా అవగాహన కల్పించాలని సూచించారు. నానో ఎరువుల వినియోగం పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఫిర్యాదుల కోసం..
ఎరువుల సరఫరాపై ఫిర్యాదులు లేదా సమాచారం అందించేందుకు కలెక్టరేట్‌లో 91549 70454 నంబరుతో కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ నంబర్‌ను ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, వరదలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జేసీ ఎస్. ఇలక్కియ, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, ఆర్డీవోలు కావూరి చైతన్య, కె.మాధురి, కె.బాలకృష్ణ, మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ