
నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన కందుల లక్ష్మణరావు కుటుంబం ఆదివారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసిన కందుల లక్ష్మణరావు, విజయ వెంకట లక్ష్మి, కుమారుడు, కోడలు రామప్రసాద్, ప్రభాచంద్ర, మనవడు, మనవరాలి పేరిట రూ. 1,00,116 విరాళాన్ని నిత్యాన్నదానానికి అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ ఏఈవో వెంకటరెడ్డి దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు.
నేటి నుంచి విధుల్లోకికృష్ణా కలెక్టర్
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం నుంచి విధులకు హాజరుకానున్నారు. జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు ముస్సోరీలో శిక్షణ కోసం వెళ్లిన ఆయన ఆదివారం సాయంత్రం మచిలీపట్నంకు చేరుకుంటారు. సోమవారం ఉదయం కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదిక (మీ కోసం) కార్యక్రమానికి హాజరవుతారు.
అప్రమత్తంగా ఉండండి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
లింగాల(వత్సవాయి): మన జిల్లాలో భారీ వర్షాలతోపాటు మునేటికి ఎగువ ప్రాంతాలైన తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాలలో వర్షాలు పడుతుండడంతో మునేటికి వరదనీరు పోటెత్తుతోందని.. లోతట్టు ప్రాంతాలలో ఉన్న వారు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ఆదివారం లింగా ల కాజ్‌వే వద్ద మునేటికి వరద ప్రవాహాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మునేటికి 12 అడుగుల మేర వరద వస్తుండగా 31వేల క్యూసెక్కుల వరద వస్తున్నట్లు చెప్పారు. గతేడాది వరదలను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారు రెండు రోజులు పాటు ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిదన్నారు. అదేవిధంగా చేపలవేటకు వెళ్లే వారు, పశువుల కాపరులు నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని దూరంగా ఉండాలన్నారు.
పటిష్ట బందోబస్తు..
వరద తగ్గే వరకు అధికారులందరూ అప్రమత్తంగా అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపే లింగాల కాజ్‌వేకు ఇరువైపులా పోలీస్, రెవెన్యూ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. వరద పరిస్థితులపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలకు నమ్మకుండా సమాచారం కావాలంటే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారాన్ని తెలుసుకోవాలని తెలిపారు. నందిగామ ఆర్డీవో బాలకృష్ణ, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో నితిన్, ఇరిగేషన్ అధికారి రామనరసింహరావు తదితరులు పాల్గొన్నారు.
మళ్లీ పెరిగిన వరద
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానది పరీవాహక ప్రాంతంతో పాటు ఎగువ ప్రాంతా ల్లో కురుస్తున్న భారీ వర్షాలు, ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద కారణంగా ప్రకాశం బ్యారేజ్‌కు మరోసారి వరద వస్తోంది. సోమవారానికి 3.97లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్‌కు 2,85,392 క్యూసెక్కుల వరద వస్తుండగా.. ఇందులో 2,82,358 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా తూర్పు కాలువకు 2,518 క్యూసెక్కులు, వెస్ట్ కెనాల్‌కు 516 క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 11.3 అడుగులుగా ఉంది. వరద పెరిగే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంతాల్లో ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కృష్ణా నది కన్జర్వేటర్ హెచ్చరించారు.

నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం

నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం