
సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం
టీడీపీ నేత వేధింపులే కారణం
పెనమలూరు: టీడీపీ నేత బరి తెగించాడు. సచివాలయ మహిళా ఉద్యోగినిని బూతులు తిడుతూ బెదిరించాడు. దీంతో ఉద్యోగి ఆత్మహత్య చేసుకోవటానికి బందరు కాలువలో దూకే యత్నం చేయగా మున్సిపాలిటీ ఉద్యోగులు, స్థానికులు ఆమెను కాపాడారు. వివరాల్లోకి వెళితే.. యనమలకుదురులో గ్రామ నాయకుడు, మరో వార్డు నాయకుడు కొద్ది రోజులుగా వీధి దీపాల వ్యవహారంలో పెత్తనం చెలాయిస్తున్నారు. వీధి దీపాలు వేయాలంటే తమ అనుమతి తీసుకోవాలని హుకుం జారీ చేశారు. దీంతో సచివాలయ సిబ్బందికి ఏం చేయాలో తెలియక మౌనంగా ఉండిపోయారు. మరో టీడీపీ నేత తాను ఉండే ప్రాంతంలో రెండు రోజుల క్రితం వీధి దీపాలు వేయించాడు. ఇది తెలుసుకున్న గ్రామ టీడీపీ నాయకుడు ఆగ్రహంతో బుధవారం సచివాలయానికి వచ్చి విధుల్లో ఉన్న మహిళా ఉద్యోగిని నిలదీస్తూ ఎవరిని అడిగి వీధి దీపాలు వేయిస్తున్నావని తీవ్రంగా దూషించాడు. బూతులు తిట్టడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆమె వెంటనే యనమలకుదురు లాకుల వద్దకు వచ్చి బందరు కాలువలో దూకబోయింది. సహచర సిబ్బంది ఆమెను వారించి రక్షించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది. ఈ విషయమై కమిషనర్ నజీర్‌ను వివరణ కోరగా ఘటనపై విచారిస్తానని, వీధి దీపాలు వేయటానికి ఎవ్వరి సిఫార్సు అవసరం లేదని చెప్పారు.
బీరువా పగులగొట్టి నగలు చోరీ
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): బీరువా తాళాలు పగులగొట్టి వెండి, బంగారు నగలను చోరీకి పాల్పడిన ఘటన విజయవాడ కొత్తపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబాపురం పరిధిలోని పైపుల రోడ్డు సమీపంలోని కృష్ణ బాబాయి హోటల్ వద్ద పన్నేరి దుర్గాప్రసాద్ తన భార్య సుమతో కలిసి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. దుర్గాప్రసాద్ ఎసీ టెక్నిషియన్‌గా పని చేస్తుంటాడు. ఈ నెల 10వ తేదీన దుర్గాప్రసాద్ భార్యకు ఇంట్లో సీమంతం జరిగింది. అదే రోజు సాయంత్రం సుమా పుట్టింటికి వెళ్లింది. 12వ తేదీ మధ్యాహ్నం దుర్గాప్రసాద్ తన ఇంటికి వచ్చి భార్యకు కావాల్సిన కొన్ని బట్టలు తీసుకుని అత్త గారి ఇంటికి వెళ్లాడు. అయితే బట్టలు సరిపోలేదని మరో డ్రెస్ తెచ్చేందుకు బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి కనిపించాయి. లోపలకు వెళ్లి చూడగా బీరువా తాళం పగలగొట్టి అందులో వస్తువులు చిందర వందరగా పడేసి కనిపించాయి. బీరువాలో ఉండాల్సిన నాలుగు గ్రాముల బంగారు నల్లపూసలు, 3 గ్రాముల బంగారపు చెవిదిద్దులు, 300 గ్రాముల వెండి వస్తువులు, కొంత నగదు చోరీకి గురయినట్లు గుర్తించాడు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
అమరేశ్వరుని పవిత్రోత్సవాలు ప్రారంభం
అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించే పవిత్రోత్సవాలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. తొలిరోజు బుధవారం ఉదయం 5గంటల నుంచి ఆలయ ఆవరణను శుద్ధిచేసి భక్తులకు 9 గంటలకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. రెండవరోజు గురువారం పవిత్రో త్సవాలలో మండప పూజలు, దీక్షాహోమాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం నిర్వహిస్తామని ఆలయ ఈవో రేఖ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.