
ప్రగతి సూచికలే ‘స్వర్ణాంధ్ర’ పునాదులు
●పీ4 అమలులో జిల్లాను ముందు వరుసలో నిలపాలి ●జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ ●విజయవాడ రైతు శిక్షణ కేంద్రంలో డీఆర్‌సీ సమావేశం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్):
స్వర్ణాంధ్ర నిర్మాణానికి కీలక ప్రగతి సూచికలే (కేపీఐ) పునాదులని.. నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఇంచార్జి మంత్రి సత్యకుమార్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అన్ని రంగాల్లోనూ వృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. బుధవారం విజయవాడ ఇరిగేషన్ కాంపౌండ్‌లోని రైతు శిక్షణ కేంద్రంలో ఎన్టీఆర్ జిల్లా మూడో సమీక్ష కమిటీ (డీఆర్‌సీ) సమావేశం సత్యకుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశతో పాటు ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, యార్లగడ్డ వెంకటరావు, వసంత వెంకట కృష్ణ ప్రసాద్, తంగిరాల సౌమ్య, శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కొలికపూడి శ్రీనివాసరావు, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్‌ఎం తదితరులు హాజరయ్యారు. తొలుత కలెక్టర్ లక్ష్మీశ.. సుపరిపాలనలో తొలి అడుగు పనుల్లో ప్రగతిని వివరించారు. మొత్తం రూ. 167.37 కోట్లతో శంకుస్థాపన చేసిన 1,661 పనుల్లో ఇప్పటికే 1,339 పనులు ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లాకు సంబంధించి 18.5 శాతం వార్షిక వృద్ధి లక్ష్యాల సాధనకు తీసుకుంటున్న చర్యలను, రంగాల వారీగా జీవీఏ, జీడీడీపీ, తలసరి ఆదాయ లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు సానుకూల దృక్పథంతో పని చేయాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు, స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకునేందుకు నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికలపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. డీఆర్‌సీ సమావేశాల్లో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. 2024–25లో జిల్లా జీడీపీ రూ. 94,561 కోట్లు కాగా దీన్ని 2025–26లో రూ.1,12,057 కోట్లకు తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. అదేవిధంగా 2024–25లో తలసరి ఆదాయం రూ. 3,53,150 కాగా దీన్ని 2028–29 నాటికి రూ. 6,38,946కు చేర్చాల్సి ఉందన్నారు. పేదరిక నిర్మూలన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన పీ4 విధానం అమల్లో జిల్లాను ముందు వరుస లో నిలబెట్టేందుకు కృషి చేయాలని సూచించా రు. విజయవాడ నగర ఘన వారసత్వ సంపద ను భావితరాలకు అందించేందుకే విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
కీలక అంశాలను ముందుంచిన ఎమ్మెల్యేలు..
సమావేశంలో ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాలకు సంబంధించి వివిధ అంశాలను ప్రస్తావించారు. పీఎం సూర్యఘర్ పథకం అమలు, గహ నిర్మాణాల వేగవంతానికి రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతుల ఏర్పాటు, అడ్డంకులు లేని సురక్షిత తాగునీటి పథకాల పటిష్ట అమలు, ఆర్ అండ్ బీ రహదారుల మరమ్మతులు, గన్నవరం–విజయవాడ రహదారి, లింకు రోడ్ల అభివృద్ధి, విజయవాడ అర్బన్ పరిధిలో కొండ ప్రాంతాలకు రెయిలింగ్, ఆటోనగర్ల అభివృద్ధి, సౌకర్యాల కల్పన, వివిధ ప్రాజెక్టుల డీపీఆర్‌ల రూపకల్పన, వేదాద్రి–కంచల ఎత్తిపోతల పథకాల సమస్యల పరిష్కారం తదితరాలపై చర్చించారు. ఎ.కొండూరుకు కృష్ణా జలాల సరఫరాకు సంబంధించి ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయినందున, పైపులైన్ల పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేసి నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎ.కొండూరు డయాలసిస్ కేంద్రంలో వారానికి ఒకసారి కా కుండా రెండు రోజులు నెఫ్రాలజిస్టు సేవలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. వీటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు. ఈ సమావేశంలో జెడ్‌పీ సీఈవో కె.కన్నమనాయుడు, డీఆర్‌వో ఎం.లక్ష్మీనరసింహం, సీపీవో వై.శ్రీలత, ఆర్టీఓలు కె.బాలకృష్ణ, కె.మాధురి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
డ్వాక్రా బజార్ల ఏర్పాటు కీలకం : ఎంపీ శివనాథ్
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి వివిధ అంశాలను ప్రస్తావించారు. విజయవాడ అర్బన్ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు డ్వాక్రా బజార్ల ఏర్పాటు, ఎర్రకట్ట పై వంతెన ఆధునికీకరణ, స్టార్మ్ వాటర్ డ్రెయిన్ వర్క్ డీపీఆర్, అర్బన్ నియోజకవర్గాల పరిధిలో ఫుడ్ కోర్టుల ఏర్పాటు, మూడు కాలువల గట్ల సుందరీకరణతో పాటు గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలు, గ్రేటర్ విజయవాడ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను వివరించారు.