
ఆటోపై కూలిన తాటి చెట్టు.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
నందమూరు(గన్నవరం): రోడ్డుపై వెళ్తున్న ఆటోపై తాటి చెట్టు కూలి డ్రైవర్ తీవ్రంగా గాయపడిన ఘటన ఉంగుటూరు మండలం నందమూరు వద్ద బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం... ఉంగుటూరు మండలం ముక్కపాడుకు చెందిన ఆటో డ్రైవర్ శ్రీను తెల్లవారుజామున పెనమలూరులో ఉన్న బందువులను ఎక్కించుకుని వచ్చేందుకు బయలుదేరాడు. నందమూరు వద్దకు రాగనే భారీ ఈదురు గాలులతో కూడిన వర్షానికి రోడ్డు పక్కనే ఉన్న తాడిచెట్టు కూలి ఒక్కసారిగా ఆటోపై పడింది. ఈ ప్రమాదంలో శ్రీనుకు బలమైన గాయాలు కావడంతో ఉయ్యూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఉంగుటూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వర్షానికి కూలిన చెట్టును ఢీకొని బైకిస్టు దుర్మరణం
గుణదల(విజయవాడ తూర్పు): వర్షానికి రోడ్డుపై కూలిన చెట్టును ఢీకొని మోటారు సైకిల్‌పై వెళుతున్న వ్యక్తి మృతి చెండాడు. ఈ ఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., గుణదల హరిజన వాడకు చెందిన తుళ్లూరి మహేష్ బాబు (37) యనమల కుదురు ప్రాంతంలో ఎలక్ట్రికల్ షాపు నిర్వహిస్తుంటాడు. రెండేళ్ల క్రితం స్వాతి అనే యువతితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. రోజు ఉదయం షాపు నిర్వహించేందుకు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి వస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం యనమలకుదురు వెళ్లిన మహేష్‌బాబు రాత్రి 11.30 గంటలకు గుణదలలోని ఇంటికి ప్రయాణమయ్యాడు. అప్పటికే వర్షానికి లయోల కళాశాల రోడ్డులో ఓ చెట్టు పడిపోయింది. రాత్రి సమయంలో వేగంగా వెళుతున్న మహేష్‌బాబు రోడ్డు పై పడి ఉన్న చెట్టును ఢీ కొట్టాడు. బలమైన గాయాలు కావడంతో రోడ్డుపై అపస్మారక స్థితిలో పడిపోయాడు. స్థానికులు 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రాథమిక వైద్యం అందించేందుకు వచ్చిన వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. మహేష్‌బాబు బైక్ పై వచ్చి చెట్టుకు ఢీ కొట్టిన సీసీ కెమేరా ఫూటేజిలు లభ్యమయ్యాయని మాచవరం సీఐ ప్రకాష్ తెలిపారు.
తండ్రి హత్య కేసులో కొడుకు అరెస్టు
పెనమలూరు: తండ్రిని హత్య చేసిన కేసులో కొడుకు అరెస్టయ్యాడు. పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిగడప శ్రీనివాసానగర్‌కు చెందిన నన్నం శౌరి(68), నన్నం కేశవరావులు తండ్రీకొడుకులు. ఇద్దరూ పెయింటింగ్ పనులు చేస్తుంటారు. రెండు రోజల కిందట కేశవరావు తనతో పాటు పనికి రావడం లేదనే కోపంతో తండ్రిపై దాడి చేశాడు. గాయపడి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించగా శౌరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా ఈ ఘటనను రోడ్డు ప్రమాదంలో శౌరి గాయపడ్డాడని తప్పుదారి పట్టించటానికి కేశవరావు యత్నించాడు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావటంతో పోలీసులు కేశవరావుపై హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేయగా కోర్టు రిమాండ్ విధించింది.

ఆటోపై కూలిన తాటి చెట్టు.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు