
విద్యార్థులూ.. డ్రగ్స్ జోలికెళ్లొద్దు!
●ఉన్నత లక్ష్య సాధన దిశగా అడుగులేయండి ●ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ
కృష్ణలంక(విజయవాడతూర్పు): విద్యార్థులు మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధన దిశగా అడుగులేయాలని ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు. విజయవాడ గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో బుధవారం యునైటెడ్ హోటల్ మేనేజ్‌మెంట్ కాలేజీ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల స్వాగత కార్యక్రమాన్ని సంయుక్త పేరుతో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐజీ విద్యార్థులతో నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉత్తమ పౌరులుగా ఎదగాలన్నారు. మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పదార్థాలు వంటి దుర్వసనాల బారినపడితే జీవితం అంధకారంగా మారుతుందని హెచ్చరించారు. నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ (ఎన్డీపీఎస్) చట్టం పట్ల విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కేసుల్లో పట్టుబడిన వారికి 20 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.2 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఈ చట్టం కింద విద్యార్థులపై కేసు నమోదైతే జీవితం అంధకారంగా మారుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల వినియోగానికి, సరఫరాకు దూరంగా ఉండాలని హితవు పలికారు.
డ్రగ్స్ రహిత సమాజం నిర్మించాలి..
విజయవాడ డీసీపీ కె.జి.వి.సరిత మాట్లాడుతూ జీవితంలో స్థిరపడి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని, దేశ ప్రగతికి కృషి చేయాలన్నారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం విద్యా సంస్థల నిర్వాహకులు, విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. ఈగల్ ఎస్పీ కె.నగేష్‌బాబు మాట్లాడుతూ ఆతిధ్య రంగంలో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అపారమైన ఉపాధి అవకాశాలున్నాయన్నారు. నషా ముక్త్ భారత్ అభియాన్ లక్ష్య సాధనలో విద్యార్థులే కీలకమన్నారు. యునైటెడ్ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని కళా నైపుణ్యాలను వెలికితీసి వారిని బహుముఖ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దటమే సంయుక్త లక్ష్యమన్నారు. అనంతరం ఈగల్ టీం ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు అనే బ్యానర్లును ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గెస్ట్ ఫ్యాకల్టీ అబ్దుల్ రెహమాన్, యునైటెడ్ కాలేజీ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ కరీమా, ప్రిన్సిపాల్ జగదీష్ జంపన, ఈవెంట్ మేనేజర్ ఉష, ఈగల్ ఇన్‌స్పెక్టర్ ఎం.రవీంద్ర, ఎస్‌ఐ ఎం.వీరాంజనేయులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.