
దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
తేలప్రోలు(గన్నవరం):
ఇంజినీర్లు తమ శ్రమ, పట్టుదల, మేధస్సుతో దేశాభివృద్ధికి దోహదపడే మంచి ఫలితాలు సాధించాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.
ఉంగుటూరు మండలం తేలప్రోలు పరిధిలోని ఉషారామ కళాశాలలో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు చేతుల మీదుగా బీటెక్ పూర్తిచేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో నేడు భారతదేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. భారత్‌లో ఉన్న యువత ప్రపంచంలోని మరే దేశంలోను లేదన్నారు. అటువంటి యువత దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించడంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డిగ్రీ పట్టాలు అందుకున్న విద్యార్థుల భవిష్యత్ ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. కళాశాల చైర్మన్ సుంకర రామబ్రహ్మం, కార్యదర్శి, కరస్పాండెంట్ సుంకర అనిల్, ప్రిన్సిపాల్ జీవీకేఎస్‌వీ. ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ లంక అరుణ్, కై కలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
హర్ ఘర్ తిరంగ ప్రచార ర్యాలీ
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ):స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగ’ ప్రచార ర్యాలీ గురవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఆర్‌ఎం మోహిత్ సోనాకియా జాతీయ జెండాను చేతపట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ రైల్వే నిర్మాణంలో సిబ్బంది కృషి ఎనలేనిదని ప్రశంసించారు. విజయవాడ రైల్వేస్టేషన్, డీఆర్‌ఎం కార్యాలయాలలో సెల్ఫీ బూత్‌లను సృజనాత్మకంగా ఏర్పాటు చేశారు. అధికారులు, సిబ్బంది, స్కూల్ విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలతో ర్యాలీ చేశారు. అనంతరం డివిజన్ ఆడిటోరియంలో జరిగిన పేట్రియాటిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 300 మంది జాక్ అండ్ జిల్, కేంద్రీయ విద్యాలయం, ఐకాన్ స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు.
నారాయణ కళాశాల విద్యార్థి ఆత్మహత్య
అజిత్‌సింగ్‌నగర్ (విజయవాడ సెంట్రల్):నారాయణ కళాశాల యాజమాన్యం తీరుతో మనస్తాపానికి గురైన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేదారేశ్వరపేట 8వ లైన్‌లో నివసిస్తున్న మల్లవరపు పద్మప్రసన్న, దుర్గాప్రసాద్ దంపతుల కుమారుడు మనుచక్రవర్తి (15) బందరు రోడ్డులో పీవీపీ మాల్ వెనుక ఉన్న నారాయణ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. ఇటీవల ఆ కళాశాలలో జరిగిన పరీక్షల్లో మనుచక్రవర్తికి మార్కులు తగ్గాయి. దీంతో కళాశాల యాజమాన్యం ఈ నెల 6న అతన్ని వేరే సెక్షన్‌కు మార్చారు. బాగా చదివే తనను తక్కువ మార్కులు సాధించే సెక్షన్‌లో వేయడంతో చక్రవర్తి జీర్ణించుకోలేకపోయాడు. కళాశాల యాజమాన్యం తీరుతో అవమానకరంగా అనిపించి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కళాశాల నుంచి ఇంటికి వచ్చి ఫ్యానుకు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య
పెనమలూరు: తాడిగడప గ్రామంలోని ఓ కుటుంబంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్య చేసకున్న ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. సీఐ వెంకటరమణ తెలిపిన వివరాల ప్రకారం... ఎన్.భానుప్రకాష్ గత 9 సంవత్సరాల క్రితం శివరంజని (30)ని వివాహం చేసుకున్నాడు. కారు డ్రైవర్‌గా పని చేస్తాడు. వీరికి రెండేళ్ల కుమార్తె ఉంది. శివరంజనికి గత 8 నెలల క్రితం గర్భస్రావం జరిగింది. అలాగే గత 7 నెలల క్రితం ఆమె తండ్రి అనారోగ్యం కారణాలతో మృతి చెందాడు. ఈ ఘటనలతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురైంది. కాగా శివరంజని ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుంది. నిద్రపోయిన భర్త లేచి చూసేసరికి భార్య ఉరేసుకొని వేలాడుతూ కనబడటంతో కానూరులో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. పరీక్షించిన వైద్యులు ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు.

దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం