సమయస్ఫూర్తే ఆపద్బాంధవుడు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎలాంటి విపత్తు సంభవించినా భయాందోళనలకు గురికాకుండా.. సమయస్ఫూర్తితో వ్యవహరించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. సరైన నిర్ణయాలు తీసుకొని తమను తాము రక్షించుకుంటూ ఇతరులకు ఆపన్నహస్తం అందించడం ముఖ్యమన్నారు.
విపత్తు స్పందన, అగ్ని మాపక సేవల శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ప్రాంగణంలో మాక్‌డ్రిల్ నిర్వహించారు. దీనిలో భాగంగా కలెక్టర్ చాంబర్‌కు ఎదురుగా అగ్ని ప్రమాదం సంభవించింది. మొదట నిచ్చెన ఆసరాగా భవనంపైకి విపత్తు స్పందన సిబ్బంది చేరుకొని ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిందకు తీసుకొచ్చారు. తక్షణ వైద్య సహాయం అందించడానికి 108 వాహనాల ద్వారా ఆస్పత్రికి తరలించడం, అగ్నిమాపక వాహనం ద్వారా నీటితో మంటలను ఆపడం వరకు మాక్‌డ్రిల్ చేశారు.
ప్రమాదాల నివారణపై డెమో
ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు వస్తే ఎలా నియంత్రించాలనే అంశాన్ని డెమో ద్వారా ప్రదర్శించారు. తడి బట్ట, ప్లాస్టిక్ బకెట్, పిండి వంటివాటితో మంటలను ఆర్పే పద్ధతులను వివరించారు.
రోడ్డు ప్రమాదాల సమయంలో రెండు వాహనాలు ఢీకొని వాటి మధ్య చిక్కుకున్న వారిని ప్రత్యేక పరికరాలు ఉపయోగించి బయటకు తీసే విధానాన్ని ప్రదర్శించారు. జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సీపీఆర్, స్ట్రెచర్ వినియోగం, అత్యవసర వైద్యం అందించడంపై అవగాహన కల్పించారు.
ప్రతి అధికారికీ అవగాహన ముఖ్యం
విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖ అధికారులకు ఎలాగూ అవగాహన ఉంటుందని.. ఇదే విధంగా వ్యవసాయం, ఉద్యాన, పరిశ్రమలు వంటి శాఖల అధికారులు కూడా సరైన అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో మాక్‌డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, జిల్లా అగ్నిమాపక అధికారి (డీఎఫ్‌వో) ఏవీ శంకరరావు, సహాయ డీఎఫ్‌వో కె.వినయ్, ఎస్‌ఎఫ్‌వో కె.నరేష్, కలెక్టరేట్ ఏవో ఎస్.శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డా. కొల్లేటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ విపత్తుల నిర్వహణపై అధికారులకు అవగాహన కల్పించేందుకే మాక్‌డ్రిల్
సమయస్ఫూర్తే ఆపద్బాంధవుడు
సమయస్ఫూర్తే ఆపద్బాంధవుడు


