ఉత్సాహంగా ముగిసిన బాలోత్సవ్ సంబరాలు
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని విజయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మహిళా కళాశాలలో గత రెండు రోజుల నుంచి విజయవాడ చిల్డ్రన్స్ స్కూల్స్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న బాలోత్సవ్ సంబరాలు ఆదివారం ఉత్సాహపూరిత వాతావరణంలో ముగిశాయి. కార్యక్రమంలో ఉభయ జిల్లాలలోని పలు పాఠశాలల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమలోని ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. కల్చరల్, అకడమిక్ విభాగాల్లో విద్యార్థులను కేటగిరీలుగా విభజించి పోటీలు నిర్వహించారు. కల్చరల్‌లో క్లాసికల్, ఫోక్ డ్యాన్స్, కోలాటం, ఏకపాత్రాభినయం ప్రదర్శనలతో అదరగొట్టారు. అకడమిక్ ఈవెంట్‌లో చదువుకు దోహదపడే పలు ఆటలతో పాటు బంక మట్టితో బొమ్మల తయారీ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేవుడి బొమ్మలు, జంతువులు, ప్రకృతి ప్రాధాన్యతను వివరిస్తూ మట్టితో మలిచిన కళాకృతులు విశేషంగా ఆకట్టుకున్నాయి.
సృజనాత్మకతకు పదును పెట్టాలి
విద్యార్థులు తమలో దాగిఉన్న సృజనాత్మకతకు పదును పెట్టినప్పుడే తమలో ప్రతిభ గురించి నలుగురికి తెలుస్తుందని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు విద్యతో పాటు తమలో దాగి ఉన్న నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. అనంతరం పలు విభాగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వీసీఎస్‌టీఏ అధ్యక్షుడు ముదిగొండ శ్రీహరిరావు, కార్యదర్శి భీమిశెట్టి గణేష్ బాబు, కోశాధికారి పుప్పాల శ్రీనివాసరావు, కో చైర్మన్ అనుమాటి చెన్నయ్య, తాళ్లూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా ముగిసిన బాలోత్సవ్ సంబరాలు


