ఊబకాయం | - | Sakshi
Sakshi News home page

ఊబకాయం

Dec 29 2025 9:22 AM | Updated on Dec 29 2025 9:22 AM

ఊబకాయం

ఊబకాయం

ఆయుష్షును హరించే

ఇతర వ్యాధులివే...

● ఒబెసిటీ ఉన్న వారిలో రక్తపోటు, మధుమేహం వలన వచ్చే దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు.

● ఒబెసిటీ ఉన్న వారిలో పది శాతం మందిలో గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడుతున్నాయి.

● ఫ్యాటీ లివర్‌ ఏర్పడి, దీర్ఘకాలంలో తీవ్రమైన లివర్‌ సమస్యలు తలెత్తుతున్నాయి.

● మోకీళ్లపై ప్రభావం చూపి, నాలుగు పదుల వయస్సులోనే మోకీలు మార్పిడి శస్త్ర చికిత్సలు చేయాల్సి వస్తుంది.

లబ్బీపేట(విజయవాడతూర్పు):

పటమటకు చెందిన వెంకట్‌ వయస్సు 35 సంవత్సరాలు. ఆహార నియమాలు పాటించకపోవడం, వ్యాయామం లేకపోవడంతో బరువు 97 కేజీలకు చేరాడు. ఇటీవల నీరసంగా ఉండటంతో ఆస్పత్రికి వెళ్లి చెక్‌ చేయించుకుంటే మధుమేహం ఉన్నట్లు తేలింది. ఒబెసిటీ కారణంగానే మధుమేహం సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

వన్‌టౌన్‌కు చెందిన శ్రావణి వయస్సు 27 సంవత్సరాలు. ప్రైవేటు ఉద్యోగం చేస్తోంది. వివాహమై మూడేళ్లు అవుతున్నా పిల్లలు లేక పోవడంతో ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. ఒబెసిటీ కారణంగా ఓవరీస్‌లో బుడగలు వచ్చినట్లు చెప్పారు. అంతేకాకుండా హైపోథైరాయిడ్‌కు గురైంది.

ఇలా అనేక మంది ఒబెసిటీ కారణంగా మధుమేహం, రక్తపోటులతో పాటు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు గుండె జబ్బులు, థైరాయిడ్‌ , కిడ్నీ సమస్యలు కూడా అధికమవుతున్నాయి. అందుకు కదలిక లేని జీవన విధానం. ఆహారపు అలవాట్లలో మార్పులతో నేడు చిన్నారుల నుంచి పెద్దవారి వరకూ ఊబకాయులుగా మారుతున్నారు. ఇలాంటి వారిలో కొన్నాళ్ల తర్వాత వ్యాధులు చుట్టుముడుతున్నాయి. గుండె జబ్బులతో పాటు, కిడ్నీ సమస్యలు, బ్రెయిన్‌ స్ట్రోక్‌, కీళ్ల సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల అనేక దుష్ఫలితాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. జాతీయ ఆరోగ్య సంస్థ నిర్వహిస్తున్న నాన్‌ కమ్యూనికల్‌ డిసీజెస్‌(ఎన్‌సీడీ) సర్వేలో సైతం ఒబెసిటీ కారణంగా రక్తపోటు, మధుమేహం వంటివి సోకుతున్నాయంటున్నారు. ఉమ్మడి కృష్ణాలో దాదాపు 10 లక్షల మంది అధిక బరువుతో ఉన్నట్లు అంచనాకు వచ్చారు.

పెరుగుతున్న గుండె జబ్బులు

గుండె జబ్బుల బారిన పడుతున్న వారిలో ఊబకాయులు ఎక్కువగా ఉంటున్నారు. గుండె జబ్బులతో ఆస్పత్రులకు వచ్చే వారిలో వారిలో 20 శాతం మందికి ఒబెసిటీ కారణంగా ఉంటుంది. అలాంటి వారిలో గుండె రక్తనాళాలు సన్నబడి బ్లాక్స్‌ ఏర్పడటం, గుండైపె ఎఫెక్ట్‌తో దెబ్బతినడం, పల్మనరీ ఎంబోలిజమ్‌, పల్మనరీ హైపర్‌ టెన్షన్‌ వంటి సమస్యలను వైద్యులు గుర్తిస్తున్నారు. రక్తనాళాల్లో బ్లాక్స్‌ ఉన్న వారికి యాంజియోప్లాస్టీ నిర్వహించి బ్లాక్స్‌ను తొలగించి స్టెంట్‌లు వేస్తున్నారు. గుండె నరాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వైద్యులు చెపుతున్నారు.

కిడ్నీ సమస్యలు

ఒబెసిటీ కారణంగా కిడ్నీలపై వత్తిడి పడుతుంది. ఆ కారణంగా ఫిల్టర్‌లు దెబ్బతింటున్నాయి. దీంతో యూరిన్‌లో ప్రోటీన్స్‌ లీక్‌ అవుతాయని వైద్యులు చెపుతున్నారు. కాళ్ల వాపులు రావడం, కిడ్నీలు పూర్తిగా పాడైన వారిని కూడా చూస్తున్నారు. ఊబకాయుల్లో వచ్చే మధుమేహం, రక్తపోటు కారణంగా కిడ్నీలు దెబ్బతిన్న వారు ప్రభుత్వాస్పత్రికి డయాలసిస్‌ కోసం వస్తున్నారు. నిత్యం 50 నుంచి 60 మంది డయాలసిస్‌ చేయించుకుంటుండగా, వారిలో సగం మంది ఒబెసిటీ కారణంగా తలెత్తిన దుష్ఫలితాల ప్రభావంగా కిడ్నీలు పాడైన వారు ఉంటున్నారు.

నియంత్రణ ఇలా...

మనదేశంలో బాడీ మాస్‌ ఇండెక్స్‌ 23.5 దాటిన వారందరినీ ఒబెసిటీగా భావిస్తారు. ఇలాంటి వారు బరువు తగ్గేందుకు శ్రమగల జీవన విధానం, సమతుల్య ఆహారం తీసుకుంటే సత్ఫలితాలు రాబట్టవచ్చు. బరువు తగ్గేందుకు లాంగ్‌టర్మ్‌, షార్ట్‌ టర్మ్‌ రెండు విధానాలు ఉన్నాయి. లాంగ్‌టర్మ్‌లో వారానికి మూడు, నాలుగు గంటలు వ్యాయామం చేయడం ద్వారా బరువు తగ్గించుకోవచ్చు. షార్ట్‌ టర్మ్‌లో రోజుకు వెయ్యి క్యాలరీల కంటే తక్కువ ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. బీఎంఐ 27 శాతం కంటే ఎక్కువ ఉన్న వారికి మందులు అందుబాటులోకి వచ్చాయి.

అధిక బరువుతో అనేక ఆరోగ్య సమస్యలు శరీర బరువు అదుపులో ఉంచుకుంటే ఆరోగ్యదాయకం మధుమేహం, రక్తపోటుకు ప్రధాన కారణం గుండెపోటుకు దారి తీస్తున్న వైనం వత్తిడికి లోనై దెబ్బతింటున్న కిడ్నీ ఫిల్టర్‌లు వ్యాయామం, ఆహార నియమాలు తప్పనిసరి అంటున్న వైద్యులు జాతీయ ఎన్‌సీడీ–సీడీ సర్వేలో ఒబెసిటీతో వ్యాధులకు గురవుతున్నట్లు గుర్తిస్తున్న వైనం

రెగ్యులర్‌ చెకప్‌ అవసరం

ఒబెసిటీ ఉన్న వారు రెగ్యులర్‌గా బీపీ, షుగర్‌, కొలస్ట్రాల్‌ పరీక్షలతో పాటు, థైరాయిడ్‌ పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఒబెసిటీని అధిగమించేందుకు ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేయాలి. ఊబకాయులకు గుండెపోటు, బ్రెయిన్‌స్ట్రోక్‌లతో పాటు, మెటబాలిజం దెబ్బతింటుంది. అదుపులో లేని మధుమేహం, రక్తపోటు సమస్యలకు దారితీస్తుంది. జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండాలి. పిజ్జాలు, బర్గర్‌లు, ఐస్‌క్రీమ్‌లు తినకుండా ఉండటం ఉత్తమం.

– డాక్టర్‌ టీవీ మురళీకృష్ణ, జనరల్‌ మెడిసిన్‌ నిపుణుడు(ఫిజీషియన్‌), విజయవాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement