
అనుబంధ కమిటీల్లో జిల్లా నాయకులకు చోటు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురిని రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో నియమించారు. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా కేసరి శివారెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా ముక్కపాటి నరసింహారావు, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శులుగా డాక్టర్ రెవరెండ్ సందీప్, కలపాల అజయ్‌కుమార్ నియమితులయ్యారు. ఈమేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది.
డాక్టర్ చంద్రహాస్‌కు అరుదైన గౌరవం
ఇబ్రహీంపట్నం: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నానికి చెందిన మైనింగ్ రంగ నిపుణుడు డాక్టర్ నిడుముక్కల చంద్రహాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. చాంబర్ ఆఫ్ మైనింగ్ అసోసియేషన్, ఇస్తాంబుల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో టర్కీలో గురువారం రాత్రి జరిగిన ఫ్రాగ్‌బ్లాస్ట్ సింపోసిజం సిరీస్‌లో 36 దేశాల ప్రతినిధులు పాల్గొనగా, సౌత్ ఇండియా తరపున డాక్టర్ చంద్రహాస్ హాజరై ఓపెన్ మైనింగ్ అంశంపై సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఓపెన్ మైనింగ్‌పై చంద్రహాస్ ఇచ్చిన ప్రజెంటేషన్‌ను మెచ్చిన ఇస్తాంబుల్ యూనివర్సిటీ ప్రతినిధులు ఆయనకు ప్రశంసాపత్రం అందజేసి అభినందించా రు. కెనడాలో 2028లో జరగనున్న సిరీస్‌కు కూ డా ఆహ్వానించారు. ఈసందర్భంగా పలువురు చంద్రహాస్‌కు అభినందనలు తెలియజేశారు.
బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటుకు డిమాండ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): దేశంలో బీసీ కులాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. సమావేశంలో రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులుగా షేక్ నాగుల్ మీరాను నియమించి ఆయనకు నియమాకపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా లాకా వెంగళరావు యాదవ్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచినా బీసీల జీవితాలలో మార్పు రాలేదన్నారు. తమిళనాడులో బీసీల ఐక్య పోరాట ఫలితంగా 69శాతం రిజర్వేషన్లు సాధించారని గుర్తుచేశారు. అదే తరహాలో దేశ వ్యాప్తంగా బీసీలు పోరాడి రిజర్వేషన్లు సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు సబ్‌కోటా కేటాయించాలని, దేశవ్యాప్తంగా కులగణనతోపాటు బీసీ కులగణను కూడా చేపట్టాలని కోరా రు. బీసీల రక్షణ కోసం వెంటనే చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగుల్‌మీరా మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన వెంగళరావు యాదవ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం బీసీ సంఘం నేతలు కలిసి నాగుల్ మీరాను సత్కరించారు.

అనుబంధ కమిటీల్లో జిల్లా నాయకులకు చోటు