
ప్రజలను దొంగ దెబ్బతీసిన మోదీ ప్రభుత్వం
గాంఽధీనగర్(విజయవాడసెంట్రల్): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వంట గ్యాస్ ధరలు పెంచి దేశ ప్రజలను దొంగ దెబ్బతీసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు విమర్శించారు. మంగళవారం విజయవాడ బీసెంట్ రోడ్డులో సీపీఎం ఆధ్వర్యంలో గ్యాస్ ధర పెంపు, పెట్రోల్, డీజిల్‌పై పన్నులు పెంచడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించారు. ఈ నిరసనలో మహిళలు వంట గ్యాస్ సిలిండర్లను తాళ్లతో మెడకు బిగించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ధర్నా నుద్దేశించి బాబూరావు, దోనేపూడి కాశీనాథ్‌లు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ధరలు తగ్గుతుండగా కేంద్రం పెట్రోలు, డీజిల్‌పై సుంకాలు విధించి వినియోగదారులపై అదనపు భారం మోపిందన్నారు. ఈ పాపంలో మోదీతోపాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సిలెండర్‌కు రూ. 50 ధర పెంచి దేశంలోని 32 కోట్ల వినియోగదారులపై రూ. 9,100 కోట్ల భారం మోపడం దుర్మార్గమన్నారు. దీపం పథకం ద్వారా గ్యాస్‌పై రాయితీలు ఇస్తామని ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో హామీ ఇచ్చిందన్నారు. కానీ అందులోనూ కొందరికి మాత్రమే అరకొర సబ్సిడీ అందిస్తోందన్నారు. కార్పొరేటర్ బోయి సత్యబాబు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీదేవి, నాయకులు పి. కృష్ణ, నారాయణ, టి.ప్రవీణ్, చిన్నారావు, కోరాడ రమణ, సీహెచ్ శ్రీనివాస్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
పెంచిన వంట గ్యాస్ ధర,పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు తగ్గించాలి సీపీఎం నాయకుల డిమాండ్