
వ్యూహాత్మక ప్రణాళికతో ‘సహకారం’ బలోపేతం
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): ఐక్యరాజ్య సమితి 2025ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా గుర్తించిన నేపథ్యంలో వ్యూహాత్మక ప్రణాళికతో సహకార స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఏడాదంతా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులకు సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన మంగళవారం 4వ జిల్లా సహకార అభివృద్ధి కమిటీ (డీసీడీసీ) సమావేశం వర్చువల్‌గా జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ‘సహకార సంస్థలు మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయి’ అనే ఇతివృత్తంతో ఈ ఏడాదిని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా గుర్తించారన్నారు. సహకార, రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయం, పశుసంవర్ధక తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రత్యేక కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. సుస్థిర అభివృద్ధి, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ, సామాజిక–ఆర్థిక అసమానతలను రూపుమాపడం తదితర లక్ష్యాల సాధనలో సహకార రంగం పోషిస్తున్న పాత్ర, సహకార ఉద్యమం ప్రాధాన్యం, సహకార సంఘాల ప్రయోజనాలు తదితరాలను తెలియజెప్పేలా సదస్సులు, ఎగ్జిబిషన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాలీలు, ఆరోగ్య శిబిరాలు, కార్యశాలలు నిర్వహించాలన్నారు. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రైతులకు పరపతితో పాటు వివిధ అవసరాలను తీర్చడంలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) పోషిస్తున్న పాత్రపై హైస్కూల్ స్థాయిలో వ్యాస రచన పోటీలు నిర్వహించాలన్నారు.
వేగంగా కంప్యూటరీకరణ..
అత్యంత పారదర్శకంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా, కాగిత రహిత సేవలు అందించే లక్ష్యంతో పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ జరుగుతోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 131 పీఏసీఎస్‌లలో 99 పీఏసీఎస్‌ల కంప్యూటరీకరణ ఇప్పటికే పూర్తయినందున.. మిగిలిన వాటిని రెండు మూడు రోజుల్లో పూర్తి చేసి వాటిద్వారా కూడా ఆన్‌లైన్ సేవలు అందేలా చూడాలన్నారు. డీసీఓ, డీసీడీసీ సభ్య కన్వీనర్ డాక్టర్ ఎస్.శ్రీనివాసరెడ్డి, జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి డీఎంఎఫ్ విజయకుమారి, పౌర సరఫరాల మేనేజర్ ఎం.శ్రీనివాసరావు, జిల్లా పశుసంవర్ధక అధికారి డాక్టర్ ఎం.హనుమంతరావు, కేడీసీసీబీ లిమిటెడ్ జీఎం రంగబాబు, మిల్క్ యూనియన్ ఏజీఎం సీహెచ్ అన్వేష్, ఎఫ్‌సీఐ ప్రతినిధి రామ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
డీసీడీసీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ