స్వామిదాసు వార్షికాదాయం రూ.5.50 లక్షలు | - | Sakshi
Sakshi News home page

స్వామిదాసు వార్షికాదాయం రూ.5.50 లక్షలు

Apr 19 2024 1:25 AM | Updated on Apr 19 2024 1:25 AM

నామినేషన్‌ దాఖలు చేసేందుకు ప్రదర్శనగా 
వస్తున్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి  స్వామిదాసు - Sakshi

నామినేషన్‌ దాఖలు చేసేందుకు ప్రదర్శనగా వస్తున్న వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి స్వామిదాసు

ఎన్నికల అఫిడవిట్‌ సమర్పించిన నల్లగట్ల

తిరువూరు: వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు గురువారం తన నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా ఆస్తులు, అప్పుల వివరాలు తెలుపుతూ అఫిడవిట్‌ను రిటర్నింగ్‌ అధికారి మాధవికి సమర్పించారు. తనకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో వార్షికాదాయం రూ.5.50 లక్షలని, తన భార్య సుధారాణి ఆదాయం రూ.4.80 లక్షలుగా చూపారు. స్వామిదాసు పేరుతో వివిధ బ్యాంకుల్లో రూ.13 లక్షలు, తియ్యగూర కోల్డ్‌స్టోరేజీలో రూ.7.85 లక్షలు పెట్టుబడి, నగదు రూ.5 లక్షలు బ్యాలెన్స్‌ ఉన్నాయని, తన భార్య పేరుతో రూ.4 లక్షల నగదు, బ్యాంకులలో డిపాజిట్‌ రూ.8 లక్షలు ఉన్నట్లు పేర్కొన్నారు. తమ కుటుంబానికి ఉన్న చరాస్తుల విలువ కోటీ 46 లక్షల 37 వేల 353 రూపాయలుగా పేర్కొన్నారు. స్థిరాస్తుల విలువ రూ.కోటీ 59 లక్షలుగా తెలిపారు. బ్యాంకులు, సహకార సంఘాల్లో రూ.17.50 లక్షల అప్పులు ఉన్నాయని ప్రకటించారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు ఫారం –1 పబ్లిక్‌ నోటీసు జారీ చేయడంతో ఈ నామినేషన్ల పర్వం మొదలైంది. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి ఆర్వో కలెక్టర్‌ ఎస్‌.ఢిల్లీరావు పబ్లిక్‌ నోటీసు జారీ చేశారు. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ కార్యాలయాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని ఒక పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు తొలి రోజు 13 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో విజయవాడ పార్లమెంట్‌కు సంబంధించి 2, అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 11 నామినేషన్లు వేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తొలి రోజు ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాలేదు. వైఎస్సార్‌ సీపీ, బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి సంబంధించి ముగ్గురు అభ్యర్థులు మాత్రమే తొలి రోజు నామినేషన్లు దాఖలు చేశారు.

● తిరువూరు నియోజకవర్గ వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామి దాసు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన ఒక సెట్‌ మాత్రమే సమర్పించారు.

● విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి యలమంచలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.

● జగ్గయ్యపేట నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి శ్రీరాం తాతయ్య, అయన సతీమణి శ్రీరాం శ్రీదేవి నామినేషన్లు వేశారు. బహుజన సమాజ్‌ పార్టీ, నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ, తెలుగు రాజ్యాధికారి సమితి పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

● నందిగామ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి తెలుగు రాజ్యాధికారి సమితి పార్టీ అభ్యర్థి రెండు సెట్లు , ఇండిపెండెంట్‌ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు చేశారు.

● విజయవాడ సెంట్రల్‌, మైలవరం నియోజకవర్గాల్లో తొలి రోజు స్వతంత్ర అభ్యర్థులు మాత్రమే నామినేషన్లు వేశారు.

● విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి తొలి రోజు రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. సోషలిస్ట్‌ యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (కమ్యూనిస్టు) అభ్యర్థి గుజ్జుల లలిత రెండు సెట్లు, తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాకు చెందిన అర్జున్‌ చేవేటి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. వీరు తమ నామినేషన్‌ పత్రాలను కలెక్టరేట్‌లోని పార్లమెంట్‌ రిటర్నింగ్‌ కార్యాలయంలో ఆర్వో, కలెక్టర్‌ ఢిల్లీరావుకు సమర్పించారు.

కట్టుదిట్టమైన భద్రత....

నామినేషన్ల సందర్భంగా నియోజకవర్గాల రిటర్నింగ్‌ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అభ్యర్థితో పాటు మరో నలుగురుని మాత్రమే ఆర్వో కార్యాలయంలోకి అనుమతిస్తున్నారు. ఆర్వో కార్యాలయానికి 100, 200 మీటర్ల వరకు పోలీసు బందోబస్తు కల్పించారు. 100 మీటర్ల పరిధి వరకు మాత్రమే అభ్యర్థుల కార్లను అనుమతించారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ఆర్వో కార్యాలయాల వద్ద టెంట్లు ఏర్పాటు చేశారు.

నామినేషన్ల ఘట్టం ప్రారంభం

ఎన్టీఆర్‌ జిల్లాలో తొలి రోజు అసెంబ్లీకి 11 నామినేషన్లు పార్లమెంట్‌కు రెండు నామినేషన్ల దాఖలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement