రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): అత్మహత్య చేసుకోవాలని ఇంటి నుంచి వెళ్లిన బాలుడిని రైల్వే అధికారులు, జీఆర్‌పీ పోలీసులు కాపాడారు. ఆ బాలుడిని అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే..కాకినాడకు చెందిన రేష్మన్(17) ఈనెల 12న విడుదలైన ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన రేష్మన్ ఈనెల 16వతేదీన ఇంటినుంచి వెళ్లిపోయాడు. దీంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించినా కనిపించకపోవడంతో బస్టాండ్, రైల్వేస్టేషన్‌లోనూ బాలుడి ఫొటో చూపించి వాకబు చేశారు. ఈ క్రమంలో కాకినాడ నుంచి బెంగుళూరు వెళ్లే శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో బాలుడు ఎక్కినట్లు అక్కడి రైల్వే పోర్టర్లు తెలిపారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు విషయాన్ని రైల్వే అధికారులకు తెలియజేయగా, వారు శేషాద్రిలో విధులు నిర్వర్తిస్తున్న టీటీఈ, జీఆర్‌పీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈక్రమంలో రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో రైలు ఆగినపుడు, రైలులోని ఎస్–11 బోగిలో ఫుట్‌బోర్డుపై రేష్మన్ కూర్చొని ఉండటాన్ని టీటీఈ ఎస్.చంద్రమౌళి గుర్తించారు. బాలుడిని రాజమండ్రి రైల్వే పోలీసులకు అప్పగించారు. రైల్వేపోలీసులు ఆ బాలుడిని బుధవారం అతని కుటుంబసభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి బాలుడిని ఆచూకీ కనుగొన్న టీటీఈ చంద్రమౌళి, జీఆర్‌పీ సిబ్బందిని ఈసందర్భంగా విజయవాడ డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్ గురువారం అభినందించారు.