గూడూరు: విజయవాడ– మచిలీపట్నం జాతీయ రహదారిపై గూడూరు సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం గరికిపర్రు గ్రామానికి చెందిన బోలెం నాగమల్లేశ్వరరావు, శివకుమారి (55) మచిలీపట్నంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చూపించుకుని మధ్యాహ్నం 3 గంటల సమయంలో తోట్లవల్లూరు తిరుగు ప్రయాణమయ్యారు. గూడూరు సమీపంలో నర్సరీలో పూలమొక్కలు కొనుగోలు చేద్దామని ద్విచక్ర వాహనాన్ని గూడూరు సెంటరులో యూ టర్న్ తీసుకుని నర్సరీ వైపుగా కరెక్ట్ రూట్‌లో వెనక్కు బయల్దేరారు. అదే సమయంలో విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వచ్చే కారు అతివేగంగా వీరి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది.
ద్విచక్ర వాహనాన్ని కొద్ది దూరం ఈడ్చుకుపోయింది. ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలైన శివకుమారి అక్కడిక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన నాగమల్లేశ్వరరావును తొలుత 108లో మచిలీపట్నం ఆస్పత్రికి ఆ తర్వాత అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన కారు అదే వేగంతో వెళ్లి మరో కారుని కూడా ఢీ కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శివకుమారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.