
అధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ ఢిల్లీరావు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సోమవారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా కావాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలు సరళి, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం కార్యకలాపాలు, వివిధ మార్గాల ద్వారా వస్తున్న ఫిర్యాదులు–వాటి పరిష్కారం, ఎన్నికల పరిశీలకులకు చేయాల్సిన ఏర్పాట్లు, ఎన్నికల సీజర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ అమలు, ఎన్నికల సిబ్బంది శిక్షణ తదితర అంశాలపై చర్చించి సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీఆర్వో వి.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో సీహెచ్ నాగలక్ష్మి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ఎం.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సీ–విజిల్ ద్వారా 526 ఫిర్యాదులు పరిష్కారం....
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సీ–విజిల్ ద్వారా 526 ఫిర్యాదులురాగా అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించినట్లు తెలిపారు. ఓటర్ హెల్ప్‌లైన్, నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పోర్టల్ (ఎన్‌జీఎస్‌పీ) తదితర మార్గాల ద్వారా మొత్తం 1,331 ఫిర్యాదులు రాగా 1,303 పరిష్కార ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. మిగిలినవి పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఓటరు హెల్ప్‌లైన్ (1950) ద్వారా 211 ఫిర్యాదులు రాగా 211 పరిష్కరించామని వెల్లడించారు. ఎన్‌జీఎస్‌పీ ద్వారా 407 ఫిర్యాదులు రాగా వాటిలో 403 పరిష్కరించినట్లు వివరించారు. అదే విధంగా వాట్సాప్ నంబరు (9154970454) ద్వారా 31 ఫిర్యాదులు రాగా 27 , కాల్ సెంటర్ (0866–2570051) ద్వారా 22 ఫిర్యాదులు రాగా 22 పరిష్కరించినట్లు తెలిపారు. కంప్లయింట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (సీఎంఎస్) ద్వారా 58 ఫిర్యాదులు రాగా 48, సీఈవో మెయిల్స్ ద్వారా 13 ఫిర్యాదులు రాగా 9 పరిష్కరించినట్లు పేర్కొన్నారు. 63 ప్రతికూల వార్తలకు సంబంధించి 57 అంశాలను పరిష్కరించినట్లు తెలిపారు. ప్రతి ఫిర్యాదుపైనా ప్రత్యేకంగా దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరిస్తున్నామన్నారు.
సమర్థవంతంగా ఎన్నికల
నియమావళి అమలు
జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థవంతంగా అమలుచేస్తున్నామని.. సీజర్ మేనేజ్‌మెంట్ వ్యవస్థ పటిష్టంగా అమలవుతోందని కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు రూ. 7.06 కోట్ల విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, విలువైన వస్తువులు, ఉచితాలు తదితరాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. రూ. 3.16 కోట్ల నగదుతో పాటు రూ. 94.16 లక్షల విలువైన 19,583 లీటర్ల మద్యం, రూ. 12.20 లక్షల విలువైన మత్తు పదార్థాలు, రూ. 2.32 కోట్ల విలువైన 7,758 గ్రాముల విలువైన లోహాలు, రూ. 6.43 లక్షల విలువైన 132 ఉచితాలు తదితరాలను సీజ్ చేసినట్లు చెప్పారు. జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి రూ. 1.16 కోట్ల మేర సీజర్లు జరిగినట్లు వెల్లడించారు. అదే విధంగా మైలవరం నియోజకవర్గంలో రూ. 48.59 లక్షలు, నందిగామలో రూ. 20.23 లక్షలు, తిరువూరులో రూ. 85.84 లక్షలు, విజయవాడ సెంట్రల్‌లో రూ. 2.75 కోట్లు, విజయవాడ తూర్పులో రూ. 64.26 లక్షలు, విజయవాడ పశ్చిమలో రూ. 94.81 లక్షల విలువైన సీజర్లు జరిగినట్లు వివరించారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు 526 సీ–విజిల్ ఫిర్యాదుల పరిష్కారం