గుంటూరు వెస్ట్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను గురువారం ముఖ్యమంత్రి ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరి కిరణ్, గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ జి.రాజకుమారి, అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, శాసన మండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవర ప్రసాద్, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు, కృష్ణబలిజ, పూసల కార్పొరేషన్ చైర్‌పర్సన్ కోలా భవాని, జిల్లా అధికారులు పరిశీలించారు. ట్రాఫిక్‌తోపాటు రైతులకు అందజేయనున్న ట్రాక్టర్లు, హార్వెస్టర్లను క్రమపద్ధతిలో ఉంచి వాటిని ముఖ్యమంత్రి చేతులమీదుగా అందించే ఏర్పాట్లపై దృష్టి సారించారు. మొత్తం పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, ఏలూరు, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల లబ్ధ్దిదారులు, రైతులు భారీ సంఖ్యలో రానున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రైతుల అభివృద్ధి కోసం చేస్తున్న ఈ మహాయాగంలో తాము పాత్రధారులమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఎక్కడా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, వర్షం వచ్చినా ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.


