సింగపూర్‌లో ఘనంగా ఉగాది వేడుకలు!

Ugadi Festival Celebration In Singapore - Sakshi

సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. శుభకృత్ నామ సంవత్సర ఉగాది న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాసునకు సుప్రభాతసేవ, తోమాలసేవ, అభిషేకం మరియు విశేషపూజలతో పాటు,మహాగణపతి, విష్ణుదుర్గ, మహాలక్ష్మి వార్లకు అభిషేకము మొదలగు విశేష కైంకర్యములతో పాటు శ్రీవారి కళ్యాణోత్సవానికి ఏప్రిల్ 2 స్థానిక సెరంగూన్ రోడ్లోని శ్రీ శ్రీనివాస పెరుమాళ్ దేవాలయంలో అత్యంత  భక్తిశ్రద్ధలతో, శాస్త్రోక్తంగా,గోవింద నామస్మరణల మధ్య నిర్వహించారు.

కళ్యాణోత్సవానంతరం శ్రీవారు ఆస్ధానంలో ఉండగా నిర్వహించిన పంచాంగ శ్రవణంను అందరూ ఆసక్తిగా ఆలకించారు. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సింగపూర్‌లో నిర్వహించిన వేడుకలకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.  ఈ సందర్భంగా నిర్వహించిన  శ్రీవారి కళ్యాణోత్సవానికి సింగపూర్ న్యాయ, హోం అఫ్ఫైర్స్ శాఖ మంత్రి కె షణ్ముగం సన్నిధిలో ఆశీస్సులు పొందారు.

తెలుగు సమాజం అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ తెలుగువారందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలపటంతో పాటు , కోవిద్ నిబంధనల మేరకు సింగపూర్ తెలుగు సమాజం గత రెండు సంవత్సరాలలో ప్రత్యక్ష కార్యక్రమాలు నిర్వహించ లేకపోయిందని,  ఎంతో కాలం తరవాత ఉగాది పండగ సందర్భంగా అందరినీ ప్రత్యక్షంగా కలవడం ఆనందంగా ఉందని అన్నారు. అలానే ఈ ఉగాది నాడు సుమారు 4000 మందికి సింగపూర్ లోనే అరుదుగా లభించే వేపపువ్వు అందించామని, సంప్రదాయబద్ధంగా తయారుచేసిన షడ్రచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడి ని ప్రత్యేక ప్యాకెట్ రూపం లో సుమారు 5000 మందికి పైగా అందించామని తెలియచేసారు.

తిరుమల తిరుపతి  దేవస్థానం మరియు తి. తి. దే. కార్యవర్గ సభ్యులు  శ్రీ చెవిరెడ్డి భాస్కరరెడ్డి గారి సహాయ సహకారాలతో కళ్యణోత్సవం లో పాల్గొన్న దంపతులకు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి లడ్డూ ప్రసాదం, వడ, అభిషేక జలం, తలంబ్రాలు మరియు వస్త్రాలు అందచేసామని తెలిపారు. కార్యక్రమానికి అన్నివిధాల సహకరించిన  పెరుమాళ్ దేవస్ధాన కార్యవర్గాలకు,దాతలకు, ప్రతి ఒక్కరికీ కార్యక్రమ నిర్వాహకులు శ్రీనివాస్ రెడ్డి పుల్లన్నగారి కృతజ్ఞతలు తెలిపారు. భక్తులకు, వాలంటీర్లకు, కార్యక్రమానికి హాజరైన మరియు లైవ్ ద్వారా వీక్షించిన అందరికీ కార్యదర్శి సత్యచిర్ల ఈ సందర్భంగా ధన్యవాదములు తెలియజేశారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top