
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన “సాహిత్యంలో హాస్యం” నవ్వుల జల్లులు కురిపించింది. తానా సాహిత్యవిభాగం-‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట గత 5 సంవత్సరాలకు పైగా, ప్రతి నెలా ఆఖరి ఆదివారం సాహిత్య సదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఆదివారం నిర్వహించిన 82వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశం “సాహిత్యంలో హాస్యం” (2 వ భాగం) “ప్రముఖ రచయితల హాస్యరచనా వైభవం” చాలా ఉల్లాస భరితంగా, ఆద్యంతం నవ్వులతో నిండింది.
తానా నూతన అధ్యక్షులు డా. నరేన్ కొడాలి మాట్లాడుతూ – “తానా ఎన్నో దశాబ్దాలగా తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళా వికాసాలకోసం అవిరళకృషి చేస్తోందని, తన పదవీకాలంలో తానా సంస్థ స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకునే దిశగా పయనించడం సంతోషంగాఉందని, అందరి సహకారంతో సంస్థ ఆశయాలను సాకారం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని అన్నారు. తెలుగు భాష, సాహిత్యాల పరిరక్షణ, పర్యాప్తిలో తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర నేతృత్వంలో గత 5 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ సాహిత్య కృషి ఎంతైనా కొనియాడదగ్గదని, ఈ నాటి కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథులందరకూ స్వాగతం అంటూ సభను ప్రారంభించారు.”
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “డా. నరేన్ కొడాలి తానా అధ్యక్ష పదవీకాలం ఫలవంతం కావాలని, తానా సంస్థను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లడానికి ఆయనకు అందరూ సహకరించాలని కోరారు. ప్రస్తుత సాహిత్య చర్చాంశం గురించి ప్రస్తావిస్తూ - తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నవల, నాటకం, వ్యాసం మొదలైన అన్ని ప్రక్రియలలోనూ హాస్యం పుష్కలంగా పండిందని అన్నారు.
కాళ్ళకూరి నారాయణగారి “చింతామణి”, “వరవిక్రయం” నాటకాలు, పానుగంటి లక్ష్మీనరసింహారావుగారి “సాక్షి” వ్యాసాలు, చిలకమర్తి లక్ష్మీ నరసింహారావుగారి “గణపతి” నవల, మునిమాణిక్యం నరసింహారావుగారి “కాంతం కథలు”, సురవరం ప్రతాపరెడ్డిగారి “మొగలాయి కథలు”, గురజాడ అప్పారావుగారి కలం నుండి జాలువారిన “కన్యాశుల్కం” నాటకంలోని అనేక హాస్య సన్నివేశాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు. జీవితంలో వత్తిడిని తగ్గించేందుకు హాస్యం మిక్కిలి దోహదపడుతుందని, సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలో ఉన్న హాస్యాన్ని అందరూ ఆస్వాదించవచ్చును అన్నారు.”

గౌరవఅతిథిగా విచ్చేసిన తెలుగువేద కవి, ప్రముఖ సినీగీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు-సాహిత్యంలో వివిధ హాస్య ఘట్టాలను వివరించి నవ్వించారు. విశిష్టఅతిథులుగా పాల్గొన్న ప్రముఖ చలనచిత్ర కథా, సంభాషణా రచయిత్రి, సినీ విమర్శకురాలు బలభద్రపాత్రుని రమణి - సుప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి, విమర్శకురాలు రంగనాయకమ్మ పండించిన హాస్యాన్ని; ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్, నృత్య రూపకాల రచయిత, కథా, సంభాషణా రచయిత బ్నిం – నరసింహారావు పేరుతో ఉన్న వివిధ ప్రముఖ రచయితలు సృష్టించిన హాస్యాన్ని ‘గాండ్రింపులు మానిన హాస్యాలుగా’; ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు సుధామ - ప్రముఖ హాస్యకథా రచయిత్రి, నవలా రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మి రచనలలోని హాస్యాన్ని;
ప్రముఖ కథా, నవలా రచయిత్రి, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మనుమరాలు అయిన లలిత రామ్ - తెనాలి రామకృష్ణుడు, దేవులపల్లి కృష్ణశాస్త్రిల సాహిత్యంలోని హాస్యాన్ని; కర్నూలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖాధ్యక్షురాలు డా. వి. వింధ్యవాసినీ దేవి – సుప్రసిద్ధ హాస్య రచయిత మునిమాణిక్యం నరసింహారావు రచనలలోని హాస్యాన్ని; ప్రముఖ హాస్యనటుడు, రచయిత, ఉపన్యాసకుడు అయిన డా. గుండు సుదర్శన్ – ప్రముఖ హాస్య రచయిత శ్రీరమణతో తనకున్న సాంగత్యం, శ్రీరమణ సాహిత్యంలో హాస్యం; ప్రముఖ రచయిత, సినీనటుడు, దర్శకుడు కాశీ విశ్వనాధ్ – ప్రముఖ రచయితలు వేటూరి సుందర రామమూర్తి, పైడిపల్లి సత్యానంద్, కొడకండ్ల అప్పలాచార్యలు సృష్టించిన హాస్యరీతుల్ని ఇలా పాల్గొన్న అతిథులందరూ వేర్వేరు రచయితలు పండించిన హాస్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించి అందరిని కడుపుబ్బ నవ్వించారు.
తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు చిగురుమళ్ళ శ్రీనివాస్ తన వందన సమర్పణలో కార్యక్రమం యావత్తూ హాస్యరస ప్రధానంగా సాగిందని, పాల్గొన్న అతిథులకు, సహకరించిన ప్రసార మాధ్యమాలకు, తానా కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.