తెలుగు వారి గుండెల్లో కోటది సుస్థిర స్థానం అంటూ నివాళులు
ప్రముఖ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త పట్ల ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 750 సినిమాల్లో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించిన కోట తెలుగు వారి మనస్సుల్లో చెరిగి పోని ముద్ర వేశారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని అన్నారు. తండ్రిగా, తాతగా, కామెడీ విలన్‌గా, పోలీసుగా, మాంత్రికుడిగా ఎన్నో పాత్రలను పోషించిన కోటను తెలుగు వారు ఎన్నటికి మరిచిపోలేరని ఓ ప్రకటనలో తెలిపారు. కోట మృతి పట్ల నాట్స్ ప్రగాఢ సంతాపాన్ని వెలిబుచ్చింది. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నామని నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి తెలిపారు.
కాగా ‘కోట’గా పాపులర్ అయిన నటుడు కోట శ్రీనివాసరావు (83) జూలై 13 తెల్లవారుజామున హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని ఫిల్మ్ నగర్‌లోని తన నివాసంలో కన్నుమూసారు. 83వ పుట్టినరోజు జరుపుకున్న కేవలం మూడు రోజులకే ఆయన మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఒక శకం ముగిసింది అంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.