 
													ఆస్ట్రేలియాలో దారుణం
అనుమానాస్పద స్థితిలో షాద్‌నగర్‌కు చెందిన అరవింద్ యాదవ్ కన్నుమూత
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అనుమానాస్పదం మరణం కలకలం రేపింది. షాద్ నగర్‌కి చెందిన అరటి అరవింద్ యాదవ్ అయిదు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. మిస్సింగ్ కేసు కూడా నమోదైంది. ఈ క్రమంలో అరవింద్ సముద్రంలో శవమై తేలడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇంటినుంచి వెళ్లిన అరవింద్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సోమవారం అతని మృతదేహం సముద్రంలో కనిపించింది. సిడ్నీలోని సముద్ర తీరానికి కొద్ది దూరంలో అరవింద్ కారును కూడా గుర్తించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు. అతనిది హత్యా, ఆత్మహత్యా అనేకోణంలో ఆరాతీస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది. ఆస్ట్రేలియా పోలీసులు మృతుడి స్నేహితులు, సహా ఉద్యోగులను విచారిస్తున్నారు. అతని భార్య ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంది.
కాగా ఉద్యోగం నిమిత్తం 12 ఏళ్లుగా సిడ్నీ లో స్థిరపడ్డాడు అరవింద్ 18నెలల క్రితం వివాహం చేసుకున్న అరవింద్ భార్య, తల్లితో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడు. ఆరు రోజుల క్రితమే తల్లి షాద్‌నగర్‌కు తిరిగి వచ్చింది. ఇంతలోనే అరవింద్ కన్నుమూయడంతో మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
2006 ఏప్రిల్ 7న ఏలూరులో జరిగిన లారీ ప్రమాదంలో బీజేపీ నాయకుడు, అరవింద్ తండ్రి ఆరటి కృష్ణ యాదవ్ మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. కృష్ణ భార్య, అరవింద్ తల్లి ఉషారాణి షాద్‌నగర్‌లో నివసిస్తున్నారు. భర్త మరణం తరువాత ఒక్కగానొక్కకొడుకును పెంచి పెద్ద చేసింది. పెళ్లి చేసి అంతా బావుంది అనుకుంటున్న సమయంలోనే ఇపుడు అరవింద్ కూడా దూరం కావడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
