
డాలస్, టెక్సస్: ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి యాభై ఏళ్ల సాహితీ ప్రస్థానాన్ని పురస్కరించు కుని తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహించిన "అత్తలూరి సాహితీ స్వర్ణోత్సవం" సాహిత్యసభ పెద్ద సంఖ్యలో హాజరయిన సాహితీప్రియులు సమక్షంలో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వ్యవహరించిన తానా పూర్వాధ్యక్షులు, ప్రస్తుత తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహాకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “అత్తలూరి కలంనుండి వివిధ అంశాలమీద ఇప్పటివరకు వెలువడ్డ 300 కథలు, 25 నవలలు, 100 రేడియో నాటికలు, 30 రంగస్థల నాటకాలు గత ఐదు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేశాయన్నారు. ఆమె రచనలు సమాజంలోని వాస్తవపరిస్థితులకు అద్దం పడతాయని, పాఠకులను ఆలోచింపజేస్తాయని అన్నారు”.
ముఖ్యఅతిథిగా విచ్చేసిన డా. సత్యం ఉపద్రష్ట మాట్లాడుతూ “విజయలక్ష్మి జీవనప్రస్థానాన్ని సాహిత్యవిజయాలతో మేళవించి, కుటుంబ విలువలను ప్రతిబింబిస్తూ ఆమె రచనలు ఎలా సాగుతాయో, తన తల్లిదండ్రుల ప్రతిభ ఎలా తనను తీర్దిదిద్దినదో, తన విజయంతోబాటు తన కుమార్తె రాజేశ్వరి విజయానికి కూడా ఎలా దారితీసిందో సోదాహరణంగా వివరించారు.”

విశిష్టఅతిథులుగా హాజరైన ప్రముఖ రచయిత కన్నెగంటి చంద్ర తన ప్రసంగంలో విజయలక్ష్మి రచించిన "నేనెవరిని" నవలలోని ముఖ్యఅంశాలను విశ్లేషిస్తూ ఈ నవల కేవలం ఒక పుస్తకం కాదని, ఇది సమాజపు అంతరాత్మను ప్రశ్నించే ఒక శక్తివంతమైన ఆయుధమని అభివర్ణించారు. ఒక స్త్రీ తన అస్తిత్వం కోసం చేసే పోరాటాన్ని ఇంత హృద్యంగా చిత్రించడం రచయిత ప్రతిభకు నిదర్శనమని ప్రశంసించారు.
విజయలక్ష్మి వ్రాసిన 300 కథలనుండి కొన్ని కధలను ప్రస్తావిస్తూ రచయిత్రి ఎంచుకున్న కథా వస్తువును, శిల్పాన్ని, కథా గమనాన్ని ప్రముఖ రచయిత్రి సుజన పాలూరి వివరించగా, మొత్తం 130 నాటికలలో కొన్ని నాటికల ఇతివృత్తాలను, అవి సాగిన తీరును నాటకరంగ ప్రముఖులు డా. కందిమళ్ళ సాంబశివరావు విశ్లేషణ చేయగా, సాహితీవేత్త విజయ భాస్కర్ రాయవరం మరికొన్ని నాటకాలను, ముఖ్యంగా “ద్రౌపది” నాటకంలో ఆ పాత్రను మలచిన తీరు, రచనలోని లోతును, సామాజిక స్పృహను స్ప్రుశించారు.
ముఖ్యఅతిథి డా. సత్యం ఉపద్రష్ట రచయిత్రి విజయలక్ష్మి వ్రాసిన “నేనెవరిని” నవలను ఆవిష్కరించి తొలి ప్రతిని సభాధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూరకు అందజేశారు. సుప్రసిద్ధ రచయిత్రి సాహితీ స్వర్ణోత్సవం అమెరికాలో జరుపుకోవడం విశేషమంటూ డా. ప్రసాద్ తోటకూర హాజరైన సాహితీప్రియులందరితో కలసి అత్తలూరి విజయలక్ష్మికి “సాహితీ స్వర్ణోత్సవ విద్వన్మణి” అనే బిరుదు ప్రదానంచేసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ “తన సాహితీ ప్రయాణంలో తన పాఠకులే తన బలమని, వారి అభిమానమే తనను ముందుకు నడిపిస్తుందని, ఈ 50 ఏళ్ళ సాహిత్య ప్రస్థానంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. "నేనెవరిని" నవల వ్రాయడానికి ప్రేరేపించిన సామాజిక పరిస్థితులను వివరిస్తూ, తన రచనల ద్వారా సమాజంలో కొంతైనా మార్పు తీసుకురావాలన్నదే తన ఆశయమని పేర్కొన్నారు”.
ఈ సాహిత్యసభకు కావలసిన అన్ని ఏర్పాట్లును, విందుభోజనంతో సహా, మరియు సమర్దవంతంగా సభానిర్వహణలో ముఖ్యపాత్ర వహించిన “రేడియో సురభి” బృందానికి, హాజరైన అతిథులకు, సాహితీప్రియులకు డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలియజేశారు.