Dallas: డాలస్‌లో ఘనంగా “అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా” కూచిపూడి నృత్యం | Advaitam Dance Of Yoga Kuchipudi Dance Performance | Sakshi
Sakshi News home page

Dallas: డాలస్‌లో ఘనంగా “అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా” కూచిపూడి నృత్యం

Jul 15 2025 11:58 AM | Updated on Jul 15 2025 11:58 AM

Advaitam Dance Of Yoga Kuchipudi Dance Performance

డాలస్‌లో ఆదివారం మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్య్వర్యంలో ప్రముఖ నాట్యగురు స్వాతి సోమనాథ్ బృందంతో “అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా” కూచిపూడి నృత్యం కన్నుల పండుగగా జరిగింది.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి అతిథులకు ఆహ్వానం పలికి సభను ప్రారంభించారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ కూచిపూడి నాట్య రంగంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన నాట్య గురు, శ్రీకాకుళం జిల్లాలో నెలకొనిఉన్న ‘సంప్రదాయం కూచిపూడి గురుకులం’ డైరెక్టర్ అయిన స్వాతి సోమనాథ్ తన శిష్యులైన కొర్రా బలరాం, నిమ్మల అంజలి లు చేసిన వివిధ నృత్య ప్రదర్శనలు రెండు గంటలపాటు ఆహుతులను అలరించాయి అన్నారు.

స్వాతి సోమనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనలమేరకు శ్రీకాకుళం జిల్లాలో 11 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నెలకొల్పబడిన ‘సంప్రదాయం కూచిపూడి గురుకులం’ ప్రపచంలోనే తొలి కూచిపూడి గురుకులం అని, వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది విద్యార్ధినీ, విద్యార్ధులు శ్రద్ధాసక్తులతో నాట్యం నేర్చుకుంటూ కూచిపూడి  నాట్యంలో డిగ్రీలు సంపాదించుకుని, దేశ విదేశాలలో తమ ప్రతిభా పాటవాలను చూపుతున్నారని, ఇటీవల డిట్రాయిట్ లో జరిగిన తానా మహా సభలకు ఆహ్వానం అందుకుని తొలిసారి అమెరికాలో అడుగుపెట్టిన పిల్లలకు డాలస్ నగరంలో డా. ప్రసాద్ తోటకూర, వారి బృందం చూపిన ఆదరణ ఎన్నటికీ మరువలేనిది అంటూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 

        

రెండు గంటల పాటు కన్నుల పండుగగా సాగిన నాట్యవిభావరి లో “శ్రీ గణనాధం” - త్యాగరాజ కృతి కనకాంగి రాగం, ఆది తాళంలో ఉన్న వినాయకుడి స్తుతితో ప్రారంభమైంది. “ఒక పరి ఒక పరి” – ఖరహర ప్రియ రాగం, ఆది తాళంలో అన్నమాచార్య కీర్తన శ్రీ వేంకటేశ్వర స్వామి అందాన్ని వర్ణిస్తుంది. ముదురు రంగులో అలమేలుమంగ సరసమైన ఛాయతో మెరుపుల పరంపరతో ఆలింగనం చేయబడిన చీకటిమేఘంతో పోల్చబడింది. “క్షీర సాగర శయన” – దేవ గాంధారి రాగం, ఆది తాళాల్లో ఉన్న ఈ త్యాగరాజ కృతి - గజేంద్ర మోక్షం, ద్రౌపది వస్త్రాపహరణం అంశాలలో చక్కగా చూపబడింది. “అద్వైతం - యోగా నృత్యం” - ప్రపంచ శాస్త్రీయ నృత్యాల చరిత్రలో మొదటిసారిగా యోగా, భారతీయ శాస్త్రీయసంగీతం యొక్క ఏడు స్వరాలు, ఆ స్వర చిహ్నాల కలయిక ఈ అంశంలో వినూత్నంగా చూపబడింది. మానవ శరీరంలో మూలాధారంతో ప్రారంభమై సహస్రారంతో ముగుస్తుంది. 7 శక్తి కేంద్రాలు నాట్యశాస్త్రం యొక్క వివిధ నృత్య భంగిమలతో చూపించబడ్డాయి.

“తెలుగు కవన నర్తనం” - తెలుగు భాషా సాహిత్యం, కవిత్వం, సంగీతానికి ముఖ్యమైనది. త్యాగరాజస్వామి కృతి ‘ఎందరో మహానుభావులు’, ‘ఎంకి నాయుడు బావ’ యుగళగీతం, అన్నమయ్య 'బ్రహ్మం ఒక్కటే’, విశ్వనాథ వారి ‘కిన్నెరసాని’, మంగళంపల్లి బాలమురళి గారి ‘తిల్లానాతో’ మొదలై భక్త రామదాసు పాటలతో తెలుగుసాహిత్యంలోని వాగ్గేయకారులకు, కవులకు నివాళితో గురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలి లు చేసిన కూచిపూడి నృత్యహేల అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది.

ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరైన భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ “మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, సాహిత్యం, కళలను నిరంతరం ప్రోత్స హిస్తున్న డా. తోటకూర ప్రసాద్ నేతృత్వంలో యింతటి గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేసినందులకు వారిని, మహాత్మాగాంధీ మెమోరియల్, తానా, ఆటా, టిపాడ్, ఇండియా అసోసియేషన్, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ సభ్యులను ప్రత్యేక అభినందనలు అన్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న పిల్లలను చేరదీసి కూచిపూడి నాట్యంలో ఎంతో అకుంటిత దీక్షతో ఆణిముత్యాలను తయారుచేస్తున్న స్వాతి సోమనాథ్ కృషి ఎంతో కొనియాడదగ్గది అని ప్రశంసించారు.  

ప్రముఖ కూచిపూడి నాట్యగురు కళారత్న కె.వి సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతి సోమనాథ్ తో చిరకాల పరిచయం అని, ఇద్దరం కలసి కొన్ని ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశామని, ఈ రోజు డాలస్ లో కలుసుకోవడం ఆనందంగా ఉందని, కూచిపూడి నాట్యాన్ని ఉన్నత స్థితికి తీసుకు వెళ్ళే ఆమె కృషి సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు.గౌరవ అతిథులుగా విచ్చేసిన బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, నాట్యగురు కె.వి సత్యనారాయణలు వివిధ సంఘాల నాయకులతో కలసి నాట్య గురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలిలలను ఘనంగా సన్మానించారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంఘ నాయకులు – డా. ప్రసాద్ తోటకూర, రావు కల్వల, తయాబ్ కుండావాల, బి ఎన్ రావు, మహేంద్ర రావు, మురళి వెన్నం, అనంత్ మల్లవరపు తో పాటు ఐఎఎన్టి నాయకులు షబ్నం మాడ్గిల్, సుష్మా మల్హోత్రా, డా. జే పి, ముర్తుజా, ఆటా, టి పాడ్ నాయకులు రఘువీర్ బండారు, వేణు భాగ్యనగర్, శారదా సింగిరెడ్డి, పాండు పాల్వాయి, సత్య పెర్కారి, తానా నాయకులు లోకేష్ నాయుడు, సతీష్ కొమ్మన, టాన్ టెక్స్ నాయకులు చంద్ర పొట్టిపాటి, సుబ్బు జొన్నలగడ్డ, భీమ పెంట, ఆనందమూర్తి, లలిత మూర్తి కూచిభొట్ల, చిన సత్యం వీర్నపు, నరసింహా రెడ్డి ఊరిమిండి, పుర ప్రముఖులు లెనిన్ వేముల, కిరణ్మయి వేముల, చంద్రహాస్ మద్దుకూరి, జాకీర్ హుస్సేన్, మడిసెట్టి గోపాల్, అత్తలూరి విజయలక్ష్మి, భార్గవి పేరి, నాగరాజు నలజుల, పూర్ణా నెహ్రు మొదలైన వారు హాజరై ఈ కార్యక్రమాన్ని ఆసాంతం ఆస్వాదించారు.

బి.ఎన్ రావు తన వందన సమర్పణలో ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడిన కాక తీయహాల్ నిర్వాహకులకు, డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి, ఫన్ ఏషియా, సురభి రేడియో యాజమాన్యాలకు, వివిధ సంఘాల ప్రతినిధులకు, హాజరైన కళాపోషకులకు, అద్భుతమైన నాట్య ప్రదర్శనలు చేసిన కళాకారులు నాట్య గురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలిలకు, గౌరవ అతిథులుగా విచ్చేసిన బిజెపి నాయకులు పాతూరి నాగభూషణం, నాట్యగురు కె.వి సత్యనారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement