breaking news
Memorial of North Texas
-
NRI: గాంధీ మెమోరియల్.. ఘనంగా అమెరికా 250 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలు!
డాలస్, టెక్సస్: మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ ఆధ్వర్యంలో డాలస్ పరిసర ప్రాంతమైన ఇర్వింగ్ నగరంలో నెలకొనిఉన్న అమెరికా దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద అమెరికాదేశపు 250వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అతి వైభవంగా జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ నగర మేయర్ యాల్ జపంటా మాట్లాడుతూ - అమెరికా జనజీవన స్రవంతిలో భాగం అవుతూ, అర్వింగ్ నగర ప్రగతికి తోడ్పడుతున్న ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు, దేశంలో కెల్లా ప్రతిష్టాత్మకమైన గాంధీ స్మారకం ఇర్వింగ్ నగరంలో ఏర్పాటు చేసినందులకు ధన్యవాదములు అంటూ అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రత్యేకఅతిథిగా హాజరైన టెక్సాస్ రాష్ట్ర ప్రతినిధి మ్యాట్ షాహీన్ తన సందేశంలో ఎన్నో దశాబ్దాలగా టెక్సాస్ రాష్ట్రంలో స్థిరపడిన ప్రవాస భారతీయులు టెక్నాలజీ, విద్యా, వైద్య రంగాలలో తమ ప్రతిభను చూపుతూ రాష్ట్ర ఆర్ధికాభివృద్ధికి తద్వారా అమెరికా జిడిపి ఎదుగుదలలో భాగస్వాములవడం అభినందనీయం అని ప్రశంసించారు. 50 మందికి పైగా “స్వర స్వాతి సింగింగ్ గ్రూప్” చిన్నారులు అమెరికా జాతీయగీతంతో సహా అనేక అమెరికా దేశభక్తి పూర్వక గీతాలు ఆలపించడం ఆనందగా ఉందని, ఈ దేశ భవిష్యత్ ఈ యువత చేతిలోనే ఉందని శుభాకాంక్షలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – “ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ప్రజాస్వామ్య దేశాలలో ఒకటైన అమెరికా స్వాతంత్ర్యానికి 250 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక చారిత్రక ఘట్టం అన్నారు. ఈ రెండున్నర శతాబ్దాల ప్రయాణంలో అమెరికా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి వచ్చిన ప్రజలు వారితో పాటు తీసుకు వచ్చిన తమ భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రతిభతో ఈ దేశాన్ని మరింత సుసంపన్నం చేశారు. భారతీయ మూలాలున్న అమెరికన్లకు విద్య, ఉపాధి, వ్యాపారం, శాస్త్ర సాంకేతిక రంగాలు, వైద్యం, ప్రజాసేవ ఇలా ప్రతి రంగంలోనూ ఎదగడానికి ఈ దేశం విశాలమైన అవకాశాలను కల్పించింది అందుకు కృతజ్ఞతలు అన్నారు.మన భారతీయ సంస్కృతిని, విలువలను కాపాడుకుంటూ మనం అమెరికా సమాజంలో భాగస్వాములవ్వాలి. స్వాతంత్ర్యం మనకు హక్కులను మాత్రమే ఇవ్వదు; బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది. మనకు లభించిన స్వేచ్ఛను గౌరవించండి. వైవిధ్యాన్ని ఆదరించండి. నిజాయితీని ఆచరించండి. మానవత్వాన్ని పెంపొందించండి. విభేదాలకంటే ఐక్యతను, స్వార్థం కంటే సేవాభావాన్ని, ద్వేషం కంటే ప్రేమను ఎంచుకుని ముందుకు సాగాలి అన్నారు.”మహాత్మాగాంధీ మెమోరియల్ బోర్డ్ సభ్యులు రావు కల్వల, తయాబ్ కుండావాలా, మహేంద్ర రావు, రాజేంద్ర వంకా వాలా, రాంకీ చేబ్రోలు, దీపక్ కార్లా, అనంత మల్లవరపు, ముర్తుజా భాయ్, సోనిట్ సింగ్, కలై కృష్ణమూర్తితో సహా అనేక సంఘాల ప్రతినిధులు అధికసంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అమెరికా 250 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం ప్రత్యేక గీతాలతో పిల్లకు తర్ఫీదు ఇచ్చి, 50 మందికి పైగా చిన్నపిల్లలతో దేశభక్తి గీతాలను పాడించిన స్వర స్వాతి సింగింగ్ గ్రూప్ అధినేత స్వాతి కుప్పిలికి, సహకరించిన పిల్లల తల్లిదండ్రులకు, కార్యకర్తలకు, ముఖ్యఅతిథిగా హాజరైన ఇర్వింగ్ మేయర్ యాల్ జపంటా, ప్రత్యేకఅతిథి టెక్సస్ రాష్ట్ర ప్రతినిధి మ్యాట్ షాహీన్ కు రావు కల్వల ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
Dallas: డాలస్లో ఘనంగా “అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా” కూచిపూడి నృత్యం
డాలస్లో ఆదివారం మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఆధ్య్వర్యంలో ప్రముఖ నాట్యగురు స్వాతి సోమనాథ్ బృందంతో “అద్వైతం-డాన్స్ ఆఫ్ యోగా” కూచిపూడి నృత్యం కన్నుల పండుగగా జరిగింది.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ కార్యదర్శి అతిథులకు ఆహ్వానం పలికి సభను ప్రారంభించారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ కూచిపూడి నాట్య రంగంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన నాట్య గురు, శ్రీకాకుళం జిల్లాలో నెలకొనిఉన్న ‘సంప్రదాయం కూచిపూడి గురుకులం’ డైరెక్టర్ అయిన స్వాతి సోమనాథ్ తన శిష్యులైన కొర్రా బలరాం, నిమ్మల అంజలి లు చేసిన వివిధ నృత్య ప్రదర్శనలు రెండు గంటలపాటు ఆహుతులను అలరించాయి అన్నారు.స్వాతి సోమనాథ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమత్రి నారా చంద్రబాబు నాయుడి ఆలోచనలమేరకు శ్రీకాకుళం జిల్లాలో 11 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో నెలకొల్పబడిన ‘సంప్రదాయం కూచిపూడి గురుకులం’ ప్రపచంలోనే తొలి కూచిపూడి గురుకులం అని, వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది విద్యార్ధినీ, విద్యార్ధులు శ్రద్ధాసక్తులతో నాట్యం నేర్చుకుంటూ కూచిపూడి నాట్యంలో డిగ్రీలు సంపాదించుకుని, దేశ విదేశాలలో తమ ప్రతిభా పాటవాలను చూపుతున్నారని, ఇటీవల డిట్రాయిట్ లో జరిగిన తానా మహా సభలకు ఆహ్వానం అందుకుని తొలిసారి అమెరికాలో అడుగుపెట్టిన పిల్లలకు డాలస్ నగరంలో డా. ప్రసాద్ తోటకూర, వారి బృందం చూపిన ఆదరణ ఎన్నటికీ మరువలేనిది అంటూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. రెండు గంటల పాటు కన్నుల పండుగగా సాగిన నాట్యవిభావరి లో “శ్రీ గణనాధం” - త్యాగరాజ కృతి కనకాంగి రాగం, ఆది తాళంలో ఉన్న వినాయకుడి స్తుతితో ప్రారంభమైంది. “ఒక పరి ఒక పరి” – ఖరహర ప్రియ రాగం, ఆది తాళంలో అన్నమాచార్య కీర్తన శ్రీ వేంకటేశ్వర స్వామి అందాన్ని వర్ణిస్తుంది. ముదురు రంగులో అలమేలుమంగ సరసమైన ఛాయతో మెరుపుల పరంపరతో ఆలింగనం చేయబడిన చీకటిమేఘంతో పోల్చబడింది. “క్షీర సాగర శయన” – దేవ గాంధారి రాగం, ఆది తాళాల్లో ఉన్న ఈ త్యాగరాజ కృతి - గజేంద్ర మోక్షం, ద్రౌపది వస్త్రాపహరణం అంశాలలో చక్కగా చూపబడింది. “అద్వైతం - యోగా నృత్యం” - ప్రపంచ శాస్త్రీయ నృత్యాల చరిత్రలో మొదటిసారిగా యోగా, భారతీయ శాస్త్రీయసంగీతం యొక్క ఏడు స్వరాలు, ఆ స్వర చిహ్నాల కలయిక ఈ అంశంలో వినూత్నంగా చూపబడింది. మానవ శరీరంలో మూలాధారంతో ప్రారంభమై సహస్రారంతో ముగుస్తుంది. 7 శక్తి కేంద్రాలు నాట్యశాస్త్రం యొక్క వివిధ నృత్య భంగిమలతో చూపించబడ్డాయి.“తెలుగు కవన నర్తనం” - తెలుగు భాషా సాహిత్యం, కవిత్వం, సంగీతానికి ముఖ్యమైనది. త్యాగరాజస్వామి కృతి ‘ఎందరో మహానుభావులు’, ‘ఎంకి నాయుడు బావ’ యుగళగీతం, అన్నమయ్య 'బ్రహ్మం ఒక్కటే’, విశ్వనాథ వారి ‘కిన్నెరసాని’, మంగళంపల్లి బాలమురళి గారి ‘తిల్లానాతో’ మొదలై భక్త రామదాసు పాటలతో తెలుగుసాహిత్యంలోని వాగ్గేయకారులకు, కవులకు నివాళితో గురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలి లు చేసిన కూచిపూడి నృత్యహేల అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసింది.ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరైన భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ “మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, సాహిత్యం, కళలను నిరంతరం ప్రోత్స హిస్తున్న డా. తోటకూర ప్రసాద్ నేతృత్వంలో యింతటి గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు ఏర్పాటు చేసినందులకు వారిని, మహాత్మాగాంధీ మెమోరియల్, తానా, ఆటా, టిపాడ్, ఇండియా అసోసియేషన్, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ సభ్యులను ప్రత్యేక అభినందనలు అన్నారు. ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న పిల్లలను చేరదీసి కూచిపూడి నాట్యంలో ఎంతో అకుంటిత దీక్షతో ఆణిముత్యాలను తయారుచేస్తున్న స్వాతి సోమనాథ్ కృషి ఎంతో కొనియాడదగ్గది అని ప్రశంసించారు. ప్రముఖ కూచిపూడి నాట్యగురు కళారత్న కె.వి సత్యనారాయణ మాట్లాడుతూ స్వాతి సోమనాథ్ తో చిరకాల పరిచయం అని, ఇద్దరం కలసి కొన్ని ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేశామని, ఈ రోజు డాలస్ లో కలుసుకోవడం ఆనందంగా ఉందని, కూచిపూడి నాట్యాన్ని ఉన్నత స్థితికి తీసుకు వెళ్ళే ఆమె కృషి సఫలీకృతం కావాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు.గౌరవ అతిథులుగా విచ్చేసిన బీజేపీ నాయకులు పాతూరి నాగభూషణం, నాట్యగురు కె.వి సత్యనారాయణలు వివిధ సంఘాల నాయకులతో కలసి నాట్య గురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలిలలను ఘనంగా సన్మానించారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంఘ నాయకులు – డా. ప్రసాద్ తోటకూర, రావు కల్వల, తయాబ్ కుండావాల, బి ఎన్ రావు, మహేంద్ర రావు, మురళి వెన్నం, అనంత్ మల్లవరపు తో పాటు ఐఎఎన్టి నాయకులు షబ్నం మాడ్గిల్, సుష్మా మల్హోత్రా, డా. జే పి, ముర్తుజా, ఆటా, టి పాడ్ నాయకులు రఘువీర్ బండారు, వేణు భాగ్యనగర్, శారదా సింగిరెడ్డి, పాండు పాల్వాయి, సత్య పెర్కారి, తానా నాయకులు లోకేష్ నాయుడు, సతీష్ కొమ్మన, టాన్ టెక్స్ నాయకులు చంద్ర పొట్టిపాటి, సుబ్బు జొన్నలగడ్డ, భీమ పెంట, ఆనందమూర్తి, లలిత మూర్తి కూచిభొట్ల, చిన సత్యం వీర్నపు, నరసింహా రెడ్డి ఊరిమిండి, పుర ప్రముఖులు లెనిన్ వేముల, కిరణ్మయి వేముల, చంద్రహాస్ మద్దుకూరి, జాకీర్ హుస్సేన్, మడిసెట్టి గోపాల్, అత్తలూరి విజయలక్ష్మి, భార్గవి పేరి, నాగరాజు నలజుల, పూర్ణా నెహ్రు మొదలైన వారు హాజరై ఈ కార్యక్రమాన్ని ఆసాంతం ఆస్వాదించారు.బి.ఎన్ రావు తన వందన సమర్పణలో ఈ కార్యక్రమ విజయానికి తోడ్పడిన కాక తీయహాల్ నిర్వాహకులకు, డి ఎఫ్ ల్యాండ్ యాజమాన్యానికి, ఫన్ ఏషియా, సురభి రేడియో యాజమాన్యాలకు, వివిధ సంఘాల ప్రతినిధులకు, హాజరైన కళాపోషకులకు, అద్భుతమైన నాట్య ప్రదర్శనలు చేసిన కళాకారులు నాట్య గురు స్వాతి సోమనాథ్, కొర్రా బలరాం, నిమ్మల అంజలిలకు, గౌరవ అతిథులుగా విచ్చేసిన బిజెపి నాయకులు పాతూరి నాగభూషణం, నాట్యగురు కె.వి సత్యనారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
డాలస్లో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
డాలస్, టెక్సస్: డాలస్లో నెలకొనియున్న అమెరికా దేశంలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద వందలాది మంది ప్రవాస భారతీయులు భారతదేశ 78వ స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ కార్యదర్శి రావు కల్వాల అందరికీ స్వాగతం పలుకుతూ వారాంతం కాకపోయినప్పటికీ అత్యధిక సంఖ్యలో ప్రజలు హాజరుకావడం ఆనందదాయకమని, మహాత్మాగాంధీ మెమోరియల్ స్థాపించి 10 సంవత్సరాలు పూర్తయిందని, ఈ స్మారకస్థలి అన్ని విశేష కార్యక్రమాలకు ప్రధాన వేదిక అయిందని, దీన్ని సాకారం చెయ్యడానికి విశేష కృషిచేసి, నాయకత్వం వహించిన ప్రవాసభారతీయ నాయకులు డా. ప్రసాద్ తోటకూరకు, సహకరించిన అధికారులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పురాతనమైన ప్రజాస్వామ్యదేశం అమెరికాలో, ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామ్యదేశం భారతదేశ 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవడం సంతోషమని, స్వాతంత్ర్య సముపార్జనలో ముఖ్యపాత్ర పోషించిన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద ఈ వేడుకలు జరుపుకోవడం ఇంకా విశేషమని, దేశస్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగంచేసిన సమరయోధులు అయినా గాంధీ, నెహ్రు, సర్దార్ వల్లభభాయి పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి నాయకులు చేసిన సేవలు చిరస్మరణీయం అంటూ ఘన నివాళులర్పించారు.ఎన్నో దశాబ్దాలగా ఇక్కడ నివాసముంటున్న ప్రవాస భారతీయులు అమెరికాదేశ విధి విధానాలను గౌరవిస్తూ, ఎన్నికలలో పాల్గొంటూ, ఇక్కడి జనజీవన స్రవంతిలో మమేకం అవ్వవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు... మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డు సభ్యులు, ఇండియా అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ బోర్డ్ సభ్యులు సుష్మా మల్హోత్రా, బి.ఎన్ రావు, జస్టిన్ వర్ఘీస్, జగజిత్లు అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. వివిధ సంఘాల ప్రతినిధులు - సత్యన్ కల్యాణ్ దుర్గ్, శాంటే చారి, లెనిన్ బాబు వేముల, నాగలక్ష్మి, గాయని భారతి, కమల్ ఫులాని మొదలైన వారు పాల్గొన్నారు. దేవులపల్లి కృష్ణ శాస్త్రి రచించిన “జనయిత్రీ దివ్యధాత్రి” గీతం లెనిన్ వేముల శ్రావ్యంగా గానంచేసి అందరినీ పరవశుల్ని చేశారు.


