యూకేలో భారతీయ సంతతి మహిళ 23 ఏళ్ల విడాకుల పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. యూకేలోనే అత్యంత అరుదైన.. సుదీర్ఘమైన విడాకుల పోరాటంలో భారత సంతతికి చెందిన వర్షా గోహిల్ ఏకంగా 6.6 మిలియన్ పౌండ్ల(సుమారు రూ. 85 కోట్లు) పరిహారాన్ని సాధించారు. ఈ కేసు 2002లో ప్రారంభమైంది. తన భర్త భద్రేష్ గోహిల్ వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నాడని.. అతని ప్రవర్తన సరిగ్గా లేదని వర్షా గోహిల్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు.
ఆనాటికి ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అప్పట్లో వీరిద్దరి మధ్య ఆర్థిక సెటిల్‌మెంట్ చాలా సాదాసీదాగా ముగిసినట్లు కనిపించింది. వర్షా దాదాపు 2,70,000 పౌండ్లు (సుమారు రూ. 3.5 కోట్లు) నగదుతో పాటు కుటుంబానికి చెందిన ప్యుజో (Peugeot) కారును తీసుకోవడానికి అంగీకరించారు. కానీ, తన భర్త తన ఆస్తులన్నింటినీ నిజాయితీగా వెల్లడించలేదని ఆమె పేర్కొంది.
నైజీరియా మాజీ గవర్నర్ జేమ్స్ ఇబోరి అనుచరులతో ముడిపడి ఉన్న భారీ మనీలాండరింగ్ (అక్రమ ద్రవ్య చలామణి) కేసులో భద్రేష్ గోహిల్ ప్రధాన నిందితుడిగా అధికారులు విచారణ చేపట్టారు. దీంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఆఫ్‌షోర్ కంపెనీలు, క్లయింట్ ఖాతాల ద్వారా భద్రేష్ మిలియన్ల కొద్దీ పౌండ్లను అక్రమంగా బదిలీ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. సుదీర్ఘ విచారణ అనంతరం మనీలాండరింగ్, ఫోర్జరీ, మోసపూరిత కుట్రకు పాల్పడినట్లు రుజువు కావడంతో 2011లో భద్రేష్ గోహిల్ 10 ఏళ్ల జైలు శిక్ష పడింది.
విచారణలో మొదటి విడాకుల కేసు సమయంలో బయటపడని కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వివిధ దేశాల్లో విస్తరించి ఉన్న నెట్‌వర్క్ కంపెనీల ద్వారా భద్రేష్ దాదాపు 28 మిలియన్ పౌండ్లను దాచాడనే కారణంగా అధికారులు ఆ ఆస్తులను ఫ్రీజ్ చేశారు. ఈ కొత్త ఆధారాలు వర్షా గోహిల్‌కు తన పాత విడాకుల సెటిల్‌మెంట్‌ను తిరిగి సవాలు చేయడానికి కొండంత బలాన్ని ఇచ్చాయి.
ఈ కేసు చివరకు యూకే కోర్టుకు చేరింది. భర్తకు చెందిన జప్తు చేసిన ఆస్తుల నుంచి తనకు మరింత భరణాన్ని ఇవ్వలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. జప్తు చేసిన మొత్తం యావత్తూ అక్రమార్జన కాదని.. అందులో కష్టపడి సంపాదించిన మొత్తం కూడా ఉందని ఆమె కోర్టుకు తెలిపారు. దీంతో వర్షా గోహిల్ వాదనతో అంగీకరించిన కోర్టు.. జప్తు చేసిన మొత్తంలో 66 లక్షల పౌండ్లు చెల్లించాలని తీర్పు వెలువరించింది. ఇకపై ఎలాంటి అప్పీళ్లకు అవకాశం లేదని కోర్టు స్పష్టం చేయడంతో ఈ 23 ఏళ్ల సుదీర్ఘ సమరానికి ఎట్టకేలకు తెరపడింది.


