● ఈనెల 28న ప్రారంభించనున్న
డీజీపీ సీవీ ఆనంద్ ?
● అదే రోజు మోపాల్ స్టేషన్ సైతం
ప్రారంభం
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలోని డిచ్‌పల్లి కేంద్రంగా నాల్గో పోలీస్ సబ్ డివిజన్ ఏర్పాటు కానుంది. ఇందుకు ఏర్పాట్లు పూర్తికాగా, ఈనెల 28వ తేదీన డీజీపీ సీవీ ఆనంద్ సబ్ డివిజన్‌ను ప్రారంభిస్తారని తెలిసింది. నూతన సబ్ డివిజన్ ఏర్పాటు కోసం పోలీస్ కమిషనరేట్ అధికారులు గత కొన్ని నెలలుగా కసరత్తు చేస్తున్నారు.
డిచ్‌పల్లి, నిజామాబాద్ రూరల్, మోపాల్, ధర్పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లి, ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌లతో నూతన సబ్ డివిజన్ ఏర్పాటు కానుంది. ఇప్పటి వరకు నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలో 15 పోలీస్ స్టేషన్‌లు ఉండగా.. తెలంగాణలోని అతిపెద్ద డివిజన్‌గా గుర్తింపు ఉంది. కొన్నేళ్లుగా డిచ్‌పలి్‌ల్ సబ్ డివిజన్ ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖ ప్రయత్నించింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో డిచ్‌పల్లి సబ్ డివిజన్ ఏర్పాటు కానుంది. ఇదివరకే ఎమ్మెల్యే పలుమార్లు డీజీపీని కలిసి విన్నవించారు. గత మే నెలలోనే ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. డిచ్‌పలి్‌ల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఏసీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. డిచ్‌పల్లి డివిజన్ ఏర్పాటు ప్రక్రియ పూర్తయితే నిజామాబాద్ డివిజన్‌పై భారం తగ్గనున్నది. ఈ డివిజన్ పరిధిలోని ఆరు పోలీస్టేషన్‌లతోపాటు నవీపేట్, మాక్లూర్ స్టేషన్‌లు ఉండనున్నాయి.
పోలీస్ బాస్ రాక..
డీజీపీ సీవీ ఆనంద్ ఈ నెల 28వ తేదీన జిల్లా పర్యటనకు రానున్నారు. ఐదో తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ – 2026 ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. అదే రోజు డిచ్‌పల్లి సబ్ డివిజన్‌ను ప్రారంభిస్తారని సమాచారం. దీనికి సంబంధించి పోలీస్ శాఖ ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. కాగా గతంలో నిజామాబాద్‌లో పనిచేసిన ఏసీపీ నూతన డివిజన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. అలాగే నూతనంగా నిర్మించిన మోపాల్ పోలీస్ స్టేషన్‌ను సైతం డీజీపీ ప్రారంభించనున్నారు.


