బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని తెలంగాణ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న బ్రెయిన్ రెయిన్–2026 జోనల్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ గురువారం ముగిసింది. జోనల్‌స్థాయి ఎగ్జిబిషన్‌లో ఉత్తమ ఆరు ప్రదర్శనలను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఏఐ, రోబోటిక్స్ అంశంలో బెల్లంపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురు కుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్(సీవోఈ) కళాశాల(మంచిర్యాల జిల్లా) విద్యార్థులు రతన్‌జ్యోతి, మిథున్, ది సీక్రెట్ లాంగ్వేజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంశాన్ని ప్రదర్శించిన పెద్దపల్లి జిల్లా రామగుండం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల విద్యార్థులు పి.లిల్లీ, ఎం.మౌనిక, మ్యాథమెటిక్స్ బిహైండ్ అవర్ స్మార్ట్ వరల్డ్ అంశాన్ని ప్రదర్శించిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాల విద్యార్థులు బి.శ్రీహర్ష, బి.అభిశ్రీ, ఎనర్జీ సోర్సెస్ అండ్ కన్జర్వేషన్ అంశంలో నిజామాబాద్ జిల్లా వేల్పూర్ సంక్షేమ బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు బి.సంజయ్, బి.జస్వంత్, అవర్ ఎర్త్ అవర్ రెస్పాన్స్‌బులిటి అంశాన్ని ప్రదర్శించిన జగిత్యాల జిల్లా సంక్షేమ బాలికల గురుకుల కళాశాల విద్యార్థులు శ్రీలక్ష్మీ, జి.హర్షిత, సస్టేయినబుల్ సిటీస్ అండ్ స్మార్ట్ లివింగ్ అంశంలో నిర్మల్ జిల్లా సాంఘిక సంక్షేమ ముధోల్ బాలుర గురుకుల కళాశాల విద్యార్థులు ఎల్.సూరజ్, ఎస్.రోహిత్ ప్రథమ బహుమతి గెలుచుకున్నారు.
తెయూ(డిచ్‌పల్లి): తెయూ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్‌లో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలను నిర్వహించారు. బయోటెక్నాలజీ అధ్యాపకురాలు ప్రసన్న మాట్లాడుతూ.. ఝాన్సీ లక్ష్మీబాయి కేవలం ఒక రా ణి కాదు, ఒక స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ సీహెచ్ ఆరతి మాట్లాడుతూ.. నేటి మహిళలు చదువులో, క్రీడల్లో, రాజకీయాల్లో, ప్రతి రంగంలో ముందుండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏబీవీపీ వర్సిటీ ప్రెసిడెంట్ సమీర్, ఇన్‌చార్జి ప్రవీణ్, నాయకులు అనిల్, అశ్విత్, దీపక్, ప్రీతం, విఘ్నేశ్, మణిచంద్ర, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
సుభాష్‌నగర్: ఇందూరులోని రఘునాథ చెరువు మినీ ట్యాంక్ బండ్ నిర్వహణను కార్పొరేషన్ అధికారులకు అప్పగించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ సూచించారు. గురువారం నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మినీ ట్యాంకు బండ్‌పై మరమ్మతులు చేయించి, వాటి నిర్వహణను కార్పొరేషన్ అధికారులకు అప్పగించాలన్నారు. నగరవాసులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన మినీ ట్యాంక్ బండ్ పై సకల సౌకర్యాలు కల్పించాలన్నారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్‌తో ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ప్రధానంగా బోధన్ రోడ్ లో గల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిస్థితి, పాత ఎమ్మార్వో కార్యాలయం వద్ద వెజ్ నాన్ వెజ్ మార్కెట్, అమ్మ వెంచర్ సమీపంలో బ్రిడ్జి ప్రతిపాదనలు తదితర అంశాలపై చర్చించారు. నగరంలోని రోడ్లపై ప్యాచ్ వర్క్, రూ.5 కోట్ల స్పెషల్ ఫండ్ స్టేటస్‌ను అడిగి తెలుసుకున్నారు.


