నిజామాబాద్‌అర్బన్ : రబీ సీజన్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని పంటల సాగు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసేలా రైతులను ప్రోత్సహించాలని పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్లతో వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక, విద్యాశాఖ, భూసేకరణ, వీధి కుక్కల నియంత్రణ, వీబీ జీ రాంజీ పనుల పురోగతిపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ పలు అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రాజెక్టుల్లో నీటి లభ్యత లేనందున వరి సాగును నివారించాలని అన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగుతో కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ఇతర పథకాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రయివేటు మార్కెట్లో జరుగుతున్న ధాన్యం కొనుగోళ్లను కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. రైతులు ప్రయివేటు వ్యాపారులకు ధాన్యం విక్రయించినప్పటికీ, కనీస మద్దతు ధరతోపాటు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ.500 బోనస్ ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కనీస మద్దతు ధర కన్నా తక్కువకు ధాన్యం విక్రయించి రైతులు నష్టపోకుండా చూడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది హాజరుపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ సూచించారు. ఎఫ్ఆర్ఎస్ ద్వారా హాజరును పర్యవేక్షించాలని, విద్యార్థుల హాజరు కనీసం 90 శాతం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లో వీధి కుక్కల సమస్యను సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరిష్కరించాలని సూచించారు. వీబీ జీ రాంజీలో భాగంగా నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఖరీఫ్‌లో వర్షాలు అనుకూలించడంతో జిల్లాలో రైతులు అధిక విస్తీర్ణంలో వరి సాగు చేశారని, దిగుబడులు కూడా ఆశించిన స్థాయిలో వస్తున్నాయని, మంచి ధర లభిస్తోందని సీఎస్ దృష్టికి తెచ్చారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో యాసంగిలో వరి సాగు చేయడం ఎంతమాత్రం తగదని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్లు రాజాగౌడ్, భుజంగరావు, డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఏవో వీరస్వామి, జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఆరుతడి పంటలు సాగు చేసేలా
రైతులను ప్రోత్సహించాలి
విద్యార్థుల హాజరు 90 శాతానికి
పెంచాలి
వీసీలో సీఎస్ సంజయ్ జాజు


