పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం చేపూర్ క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ కార్గో ట్రాలీని శుక్రవారం ప్రదర్శించారు. వస్తువుల రవాణాను సులభతరం చేసి మానవ శ్రమను తగ్గించడంతోపాటు పర్యావరణ హితంగా ట్రాలీని రూపొందించారు. పారిశ్రామిక అవసరాల అనుకూలతను అధ్యయనం చేసేందుకు ప్లాక్స్ ఫైబర్ రీన్‌ఫోర్‌స్డ్ కాంపోజిట్ ప్రాజెక్టును రూపొందించి ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ విభాగాధిపతి వీ వేద ప్రకాశ్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పాఠ్యంశాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్, ఫ్యాబ్రికేషన్, పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ఏ దేవేందర్, ప్రిన్సిపల్ కేకే శ్రీనివాస్, డైరెక్టర్ ఏ వీరేందర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


