మరో కీలక కారణం 10వ తరగతి ఫలితాలు. తమ పాఠశాలలో దివ్యాంగ విద్యార్థుల సంఖ్య ఎక్కువగా చూపిస్తే, వారు 10వ తరగతిలో ఫెయిల్ అయితే తమ స్కూల్ పాస్ పర్సంటేజీ పడిపోతుందని కొందరు ప్రధానోపాధ్యాయులు భయపడుతున్నట్టు సమాచారం. నిజానికి దివ్యాంగ విద్యార్థులకు స్క్రైబ్ సౌకర్యం, అదనపు సమయం, భాషా మినహాయింపులు వంటి ఎన్నో రాయితీలు ఉన్నాయని, వారికి ప్రత్యేకంగా బోధి స్తే ఫలితాలు మెరుగుపడతాయనే విషయాన్ని మరుస్తున్నారు. దివ్యాంగ పిల్లలను దాచిపెడితే వారు ప్రభుత్వం ఇస్తున్న ఉచిత సహాయ పరికరాలు, స్కాలర్‌షిప్‌లు, రవాణాభత్యం వంటి ప్రయోజనాలను కోల్పోతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆర్మూర్ : సమగ్ర శిక్ష లక్ష్యం ప్రతి దివ్యాంగ బిడ్డకు విద్యనందించడం. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ప్రశస్త్ యాప్ ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల స్క్రీనింగ్ నిర్వహించి వారిలోని లోపాలను గుర్తించే పనిని ప్రతిష్టాత్మకంగా చేపట్టాయి. కానీ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దివ్యాంగ విద్యార్థులను గుర్తించి చూపించేందుకు ఇష్టపడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అసలు సమస్య ఎక్కడ..
కేంద్ర ప్రభుత్వం ఆర్‌పీడబ్ల్యూడీ చట్టం 2016 ప్రకారం గుర్తించిన 21 రకాల వైకల్యాలపై ఉపాధ్యాయులకు సరైన అవగాహన లేకపోవడం. అంధత్వం, తక్కువ దృష్టి (లో విజన్), కుష్టు నుంచి కోలుకున్న వారు, వినికిడి లోపం, లోకో మోటార్ వైకల్యం, మరుగుజ్జుతనం, ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, మానసిక అనారోగ్యం, ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, మస్క్యులర్ డిస్ట్రోఫీ, దీర్ఘకాలిక నాడీ సంబంధిత పరిస్థితులు, స్పెసిఫిక్ లర్నింగ్ డిసేబులిటీస్, మల్టిపుల్ స్ల్కైరోసిస్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజే బులిటీ, తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌సెల్, బహుళ వైకల్యాలు, యాసిడ్ దాడి బాధితులు, పా ర్కిన్సన్ వ్యాధులు ఉండగా చాలా మంది ఉపాధ్యాయులకు అంధత్వం, చెవుడు, కాలు చేయి లేకపోవడం మాత్రమే తెలుసు. దీంతో మిగతా పిల్లలను సాధారణ పిల్లలుగానే పరిగణిస్తున్నారు.
సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో ఐఈఆర్పీలు నిర్వహించిన సర్వే ప్రకారం ఈ వి ద్యా సంవత్సరం జిల్లా వ్యాప్తంగా సుమారు 4,300 మందిని వివిధ కేటగిరీల్లో దివ్యాంగ విద్యార్థులుగా గుర్తించి యూడైస్ ప్లస్‌లో నమోదు చేయించారు. ప్రస్తుతం ఉపాధ్యాయుల నిరాసక్తత కారణంగా ఈ సంఖ్య గణనీయంగా తగ్గనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రశస్త్ లక్ష్యం నీరుగారి పోనుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,811 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 3,27,980 మంది విద్యార్థులు ఉండగా.. సోమవారం నాటికి 1,446 పాఠశాలల్లో 1,94,777 మంది విద్యార్థులను స్క్రీనింగ్ నిర్వహించారు. దీంతో జిల్లాలో 59.4 శాతం స్క్రీనింగ్ పూర్తయింది. చాలా మటుకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు స్క్రీనింగ్ నిర్వహించడానికి ఆసక్తి చూపడం లేదు.
ఎందుకనే ధోరణి..
కొందరు ఉపాధ్యాయులు మాకెందుకులే ఈ తలనొప్పి అనే ధోరణిలో ఉంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దివ్యాంగ విద్యార్థిని గుర్తిస్తే యూడైస్ ప్లస్‌లో నమోదు చేయాలి. వైద్య ధ్రువీకరణ కోసం తల్లిదండ్రులను ఒప్పించి సదరం క్యాంపులకు తీసుకెళ్లాలి. అసెస్‌మెంట్ క్యాంపుల్లో పాల్గొనాలి. ఈ ప్రక్రియ అంతా భారంగా భావిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
దివ్యాంగ విద్యార్థులను
గుర్తించేందుకే..
పాఠశాలల్లో సమస్యలు ఎదుర్కొంటున్న దివ్యాంగ విద్యార్థులను గుర్తించేందుకే ప్రశస్త్ ద్వారా స్క్రీనింగ్ నిర్వహిస్తున్నాం. క్షేత్ర స్థాయిలో కొందరు ఉపాధ్యాయులకు అవగాహన లోపంతో సమస్య ఉత్పన్నమవుతున్నట్లు మా దృష్టికి వస్తోంది. వారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తున్నాం. విధిగా విద్యార్థుల స్క్రీనింగ్‌లో నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాం. – పడకంటి శ్రీనివాస్‌రావు,
ఐఈ జిల్లా కోఆర్డినేటర్, సమగ్రశిక్ష
విద్యార్థులను స్క్రీనింగ్ చేస్తున్న ఉపాధ్యాయురాలు (ఏఐ చిత్రం)
10వ తరగతి ఫలితాల భయం..
దివ్యాంగ విద్యార్థ్థుల గుర్తింపు కోసం కొనసాగుతున్న ప్రశస్త్
స్క్రీనింగ్‌కు ఇష్టపడని కొందరు ప్రధానోపాధ్యాయులు
గణనీయంగా తగ్గనున్న
దివ్యాంగ విద్యార్థుల సంఖ్య


