జిల్లా కేంద్రంలో శనివారం అరటి ఆకులు విక్రయిస్తున్న చిరువ్యాపారులు
దసరా సందర్భంగా షాపింగ్ మాల్‌లో కొనుగోలుదారుల సందడి (ఫైల్)
ఆర్మూర్: పండుగలు మనిషి బతుకుకు ‘పండుగే..’ వినాయకు మట్టి విగ్రహం తయారీ వెనుక ఒక కుమ్మరి కుటుంబం.. పీవోపీ ప్రతిమ తయారీ వెనుక ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కుటుంబాలు.. బతుకమ్మ అందమైన పూలతో పేరిస్తే పూలతోట సాగు చేసిన రైతు, వాటిని విక్రయించిన వ్యాపారి.. దసరా బట్టల వ్యాపారం వెనుక నేతన్నలు.. దీపావళి వచ్చిదంటే వెలుగుల దివ్వెలు విక్రయించే వీధి వ్యాపారులు.. ఇలా కంటికి కనిపించే పండుగుల వెలుగుల వెనుక కనిపించని జీవితాలు ఎన్నో ఆధారపడి ఉన్నాయి. బతుకమ్మ వచ్చిందంటే జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.5 కోట్లకు పైగా పూల వ్యాపారం జరుగుతుంది. వినాయక ఉత్స వాల సందర్భంగా సుమారు రూ.3 కోట్ల విలువైన విగ్రహాల వ్యాపారం, దసరా, దీపావళికి సుమారు రూ.100 కోట్ల వరకు వ్యాపారం సాగుతుంది. ఇక పండుగ ఏదైనా పండ్ల విక్రయాలు మాత్రం నిరాటంకంగా సాగుతూనే ఉంటాయి.
కుమ్మరి, పూలరైతు, టెంట్ హౌస్, మేకప్ ఆర్టి స్ట్, డప్పు కళాకారుడు, చిరు వ్యాపారులు ఎంతో మందికి ఏడాదిలో 4 నె లల్లో వచ్చే పండుగలే జీవనాధారం. పండుగల వేళ మార్కెట్ లో లిక్విడిటీ పెరుగుతుంది. రైతు పంట అమ్మిన డబ్బును దసరాకు బట్టలు, బంగారం కొనడానికి వాడతాడు. అదే డబ్బు వ్యాపారి దగ్గరి నుంచి మళ్లీ రైతుకు ఎరువుల రూపంలో వెళ్తుంది. తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మను ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో జరుపుకోవాలని ప్లాన్ చేసింది. ఇది పర్యాటక ఆదాయాన్ని పెంచుతుంది. బతుకమ్మ సమయంలో పర్యాటకులు వస్తే హోటల్స్, ఆటోలకు గిరాకీ. పండగలు ఆగిపోతే ఈ గొలుసు తెగిపోతుంది. అందుకే కాలం ఎట్లా ఉన్నా పండగలు ఉన్నంత వరకు ఆర్థిక వ్యవస్థ చక్రం తిరుగుతూనే ఉంటుంది.
దసరా వేళ..
జిల్లా వాసులకు దసరా అంటే చాలు కొత్త బట్టల వేడుక. గతంలో హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైన షాపింగ్ మాల్స్ జిల్లా కేంద్రంతోపాటు మున్సిపాలిటీలకు సైతం విస్తరించాయి. మరో వైపు రెడీమేడ్ బట్టల వ్యాపారం ప్రతి దసరాకు జోరుగా సాగుతుంది. దీంతో చిన్న బట్టల వ్యాపారుల తోపాటు షాపింగ్ మాల్స్ యజమానులు లాభాల బాట పడతారు.
దీపావళి పటాకుల మోత
దీపావళి అంటే చాలు పటాకుల మోత వినిపిస్తుంది. గ్రామ గ్రామాన పటాకుల దుకాణాలు వెలుస్తాయి. మొత్తంగా సుమారు రూ.15 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. సీజనల్‌గా వ్యాపారం చేసే చిరు వ్యాపారులు టెంట్లు వేసి పటాకులు విక్రయించి రూ.వేలల్లో వ్యాపారం చేస్తారు.
వినాయక చవితి.. మట్టి నుంచి మైకు వరకు
జిల్లా వ్యాప్తంగా గల్లీగల్లీలో సుమారు పది వేల వరకు వినాయక మండపాలు ఏర్పాటవుతాయి. ఒక్కో విగ్రహం రూ.5 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయిస్తుంటారు. ఇక ఇళ్లలో ప్రతిష్టించుకొనే చిన్న విగ్రహాల రిటైల్ వ్యాపారం మొత్తంగా రూ.కోట్లలో ఉంటుంది. వినాయక చవితి వేడుకలకు అనుబంధంగా పందిరి వేసే మేదరి, లైటింగ్, సౌండ్ సిస్టం, పూల దండలు, ప్రసాదం, అన్నదానాల రూపంలో నవరాత్రుల్లో సుమారు రూ.15 కోట్ల వరకు వ్యాపారం సాగుతుంది.
దసరా దుస్తుల నుంచి దీపావళి
పటాకుల వరకు జోరుగా విక్రయాలు
పండుగలతో వేలాది కుటుంబాలకు
జీవనోపాధి
వినాయక విగ్రహాల నుంచి బతుకమ్మ పూల వరకు.. పర్వదినాల్లో జిల్లాలో రూ.కోట్లలో వ్యాపారం
పండుగ వస్తూనే ఆశలను మోసుకొస్తుంది. ఎన్నో కుటుంబాల్లో నెలకొనే ‘పండుగ సందడి’.. కొన్ని కుటుంబాలకు ‘ఉపాధి సందడి’ని తీసుకొస్తుంది. పండుగ అంటే కేవలం భక్తి కాదు.. ఒక ఆర్థిక వ్యవస్థ. వినాయకుల విగ్రహాల తయారీ నుంచి బతుకమ్మ పూల వరకు.. దసరా దుస్తుల నుంచి దీపావళి పటాకుల విక్రయాల వరకు రూ.కోట్లలో సాగే వ్యాపారాలు వేలాది కుటుంబాల్లో వెలుగులు తీసుకొస్తున్నాయి.
పూల విక్రయాలు..
రైతులు చెమటోడ్చి పండించే పూల విక్రయాలతో వందల సంఖ్యలో వ్యాపారుల కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుంది. వినాయక, దుర్గా నవరాత్రులతోపాటు అయ్యప్పల సీజన్‌లో పూల విక్రయాలు జోరుగా ఉంటాయి. – సూర్యనీడ రాజ్‌కుమార్,
పూల వ్యాపారి, ఆర్మూర్
కొత్త బట్టలు..
దసరా వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో కొత్త బట్టల సందడి ప్రారంభమవుతుంది. తెలంగాణ ప్రాంతంలో దస రాకు ఒక ప్రత్యేకత ఉంటుంది. కాబట్టి కాలం ఎట్లా ఉన్నా ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు కొనుక్కోవడం వల్ల బట్టల వ్యాపారం సజావుగా జరుతోంది.
– రంగోలి సత్యం, వస్త్ర వ్యాపారి, ఆర్మూర్
పండుగ ఏదైనా పండ్ల వ్యాపారం
పండుగ ఏదైనా పండ్ల వ్యాపారం మాత్రం జోరుగా సాగుతుంది. ముందు రోజు నుంచే పండ్లు కొనుగోలు చేస్తారు. అయ్యప్పల సీజన్‌లో పండ్ల విక్రయాలు మరింత పెగుతాయి.
– అరుణ్, పండ్ల వ్యాపారి, ఆర్మూర్


