● సకాలంలో నాణ్యతతో పనులను
పూర్తి చేయించాలి
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
● పనుల పురోగతిపై సమీక్ష
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సకాలంలో నాణ్యతతో పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. పీఎం శ్రీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల ప్రిన్సిపాల్‌లు, ఎంఈవోలు, మండల స్పెషల్ ఆఫీసర్లతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ శనివారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల వారీగా పనుల పురోగతి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్లే గ్రౌండ్, కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీ, సోక్ పిట్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ తదితర పనుల పురోగతిని పరిశీలిస్తూ అధికారులకు సూచనలు చేశారు. పలు పాఠశాలల్లో చక్కగా పనులు జరిగాయని, మిగతా బడులలో కూడా మంజూరైన నిధులను పూర్తిస్థాయిలో వెచ్చిస్తూ వేగంగా పనులు పూర్తయ్యేలా చొరవ చూపాలన్నారు. వచ్చే వారం నాటికి అన్ని బడుల్లో 50 శాతానికిపైగా నిధుల వెచ్చింపు పూర్తి కావాలన్నారు. పనులు పూర్తయిన వెంటనే నిధులు విడుదలయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు. అదనపు కలెక్టర్ భుజంగరావు, ఇన్‌చార్జి డీఈవో సాయాగౌడ్, డీఆర్డీవో సాయన్న, టీజీఈడబ్ల్యూఐడీసీ ఈఈ రవీందర్, మండల ప్రత్యేకాధికారులు, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.


