ఎన్‌ఎస్‌ఎస్ టీ–7 క్రికెట్ టోర్నీ ప్రారంభం
తెయూ(డిచ్‌పల్లి): తెయూలో గురువారం జాతీయ సేవాపథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎ స్ టీ–7 క్రికెట్ టోర్నమెంట్‌ను వీసీ యాదగిరిరావు ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని, అనంతరం స్వయంగా బ్యాటింగ్ చేశారు. ఈసందర్భంగా వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్య త ఇవ్వాలని సూచించారు. క్రీడలు శారీరక ఆరో గ్యంతోపాటు మానసిక ఉల్లాసానికి, వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. టోర్నమెంట్‌లో అప్లయిడ్ ఎకనామిక్స్, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఫార్మసీ, ఇంజినీరింగ్ విభాగా లకు చెందిన జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. తెయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ అపర్ణ, యూనిట్–1 ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ బీఆర్ నేత, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం
తెయూ(డిచ్‌పల్లి): దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని తెలంగాణ యూనివర్సిటీ వీసీ యాదగిరి రావు సూచించారు. తెలంగాణ యూనివర్సిటీలో గురువారం వికసిత్ భారత్ యువ సంవాద్–2026ను వర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ సెమినార్ హాల్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన వీసీ యాదగిరిరావు మాట్లాడుతూ.. వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని, ప్రజాస్వామ్య విలువలు, పౌర బాధ్యతలను పాటించాలన్నారు. నేషనల్ యూత్ ఐకాన్ ప్రబల్ చౌహాన్ మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాదులని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సందేహాలను నివృత్తి చేశారు. జిల్లా యువజన అధికారి రమేష్, తెయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ అపర్ణ, ప్రిన్సిపాల్ రాంబాబు, డీన్ సీహెచ్ ఆంజనేయులు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు పాల్గొన్నారు.
13 నుంచి డిగ్రీ పరీక్షలు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని అన్ని అండర్ గ్రాడ్యుయేట్ కళాశాలలకు సంబంధించిన బీఏ/బీకామ్/బీఎస్సీ./బీబీఏ/బీసీఏ 5వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన సూచించారు.
యువ పార్లమెంట్–2027కు
తెయూ విద్యార్థిని ఎంపిక
తెయూ(డిచ్‌పల్లి): రాష్ట్రస్థాయి యువ పార్లమెంట్–2027 పోటీలకు తెలంగాణ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) యూనిట్–2 వలంటీర్, ఎంఎస్సీ బోటనీ విద్యార్థిని సందీప్తి ఎంపికై ంది. జిల్లా యువజన అధికారి, మై భారత్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్, యూత్ పార్లమెంట్ జిల్లాస్థాయి పోటీల్లో ఆమె ప్రతిభ కనబరిచి జిల్లా నుంచి రాష్ట్రస్థాయికి ఎంపికై నది. ఈసందర్భంగా తెయూ వీసీ యాదగిరి రావు, రిజిస్ట్రార్ యాదగిరి గురువారం సందీప్తిని సత్కరించి, అభినందించారు.


