● కాంగ్రెస్ కృషితోనే మాధవనగర్
ఆర్వోబీకి నిధులు
● డీసీసీ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి
నిజామాబాద్ రూరల్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి బీఆర్‌ఎస్, బీజేపీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్ రెడ్డి విమర్శించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డితోపాటు జిల్లా కాంగ్రెస్ నేతలు కలిసి సీఎం రేవంత్‌రెడ్డితో సమావేశమై ఆర్వోబీల అభివృద్ధిపై మాట్లాడినట్లు గుర్తుచేశారు. జీఎస్టీ పెరిగిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆర్వోబీ నిధులను రూ.101.80 కోట్లకు పెంచి జీవో మంజూరు చేశారని, దానిని గ్రహించిన ఎంపీ అర్వింద్ ఆకస్మికంగా మాధవనగర్ ఆర్వోబీ వద్ద ధర్నా చేసినట్లు ఎద్దేవా చేశారు. ఎంపీ అర్వింద్ ఉనికి కోసమే ధర్నా చేశారని, ఓ స్కూల్ యాజమాన్యాన్ని బెదిరించి విద్యార్థులను తీసుకువచ్చినట్లు ఆరోపించారు. జిల్లా ఎంపీగా ఎనిమిది సంవత్సరాలలో చేసిందేమీ లేదన్నారు. బండి సంజయ్ కరీంనగర్‌కు స్మార్ట్ సిటీ తీసుకువచ్చాడని, జిల్లా ఎంపీగా ఉండి నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీగా ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. పసుపు బోర్డు తీసుకువచ్చానని గొప్పలు చెప్పుకుంటున్న ఎంపీ దాంతో రైతులకు జరిగిన లాభమేమీ లేదని విమర్శించారు. సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, మేయర్ ఉమారాణి, డీసీసీ కోశాధికారి భక్తవత్సలం, ఉపాధ్యక్షుడు కౌడపు శరత్ కుమార్, మహిళా అధ్యక్షురాలు రేవతి, మున్సిపల్ మాజీ ఫ్లోర్‌లీడర్ రాజేంద్రప్రసాద్, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు బెన్సన్ రాజు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


