● జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి
● ఇ–కోర్టు సర్వీస్ సెంటర్ ప్రారంభం
నిజామాబాద్ లీగల్: న్యాయవ్యవస్థ ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని డిజిటల్ మార్పుల దిశగా వేగంగా ప్రయాణిస్తున్నదని జిల్లా జడ్జి జీవిఎన్ భారతలక్ష్మి అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో ఇ–సేవా కేంద్రాన్ని గురువారం ఆమె అదనపు జిల్లా జడ్జీలు సుగాలి నారాయణ, ధారావత్ దుర్గాప్రసాద్, క్షత్రి ఉషారాణి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలకంఠ రావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడు తూ క్రిమినల్ కేసుల్లో బెయిలు దరఖాస్తులు మినహా, సివిల్ కేసుల్లో ప్రతి దావాలు ఇ– కోర్టు సేవా కేంద్రంలో దాఖలు చేయడానికి అవకాశం ఉందని అన్నారు. దరఖాస్తు దాఖలైన వెంటనే సంబంధిత కంప్యూటర్ ఆపరేటర్ వాటిని డిజిటలైజేషన్ చేస్తారని, అనంతరం ఆ ఫైల్స్‌ను సంబంధిత కోర్టులకు పంపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జీలు అజయ్ ఉల్లం, జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి ముద్దసాని నీలిమ, సబ్ కోర్టు జడ్జి చైతన్య అంగరి, జూనియర్ సివిల్ జడ్జీలు పాముజుల శ్రీనివాస్ రావు, వడ్డి హరికుమార్, జిల్లా కోర్టు ముఖ్య పరిపాలన అధికారి గోవింద్ రావు తదితరులు పాల్గొన్నారు.


