● మెము ఎక్స్‌ప్రెస్
నడుపాలని
వినతులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: దశాబ్దాలు గడుస్తున్నా జిల్లా పరిధిలో రైల్వే సర్వీసుల సంఖ్య పెరగక ప్ర యాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా నిజామాబాద్ నుంచి పెద్దపల్లి మీదుగా కాజీ పేట వరకు మెము (మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్స్) ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలన్న డిమాండ్ ఏళ్లుగా వినిపిస్తోంది. ఈ రూట్‌లో రైల్వే ట్రాక్ అందుబాటులోకి వచ్చి దశాబ్దకాలం పూర్తయినప్పటికీ ఇప్పటివరకు రద్దీకి తగినట్టుగా రైళ్లు నడపడం లేదు. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కీలక జంక్షన్‌గా ఉన్న నిజామాబాద్ నుంచి కాజీపేట వరకు రైలు సదుపాయం మెరుగుపరిస్తే ప్రయాణికులకు విస్తృత ప్రయోజనం కలుగనుంది.
నమో భారత్ మనకెప్పుడు?
దేశంలో వందే భారత్ రైలు తరహాలో తక్కువ దూ రంలో ఉన్న ప్రాంతాలను మరింత వేగంగా చేరుకునేందుకు రైల్వే శాఖ ‘నమో భారత్ ర్యాపిడ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్’ సేవలను ప్రవేశపెట్టింది. అయితే దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని తెలంగాణలో ఈ రైళ్లను ఇప్పటివరకు అందుబాటులోకి తేలేదు. నిజామాబాద్ – కరీంనగర్ – వరంగల్ మార్గంలో వేగంగా ప్రయాణించేందుకు ఈ తరహా రైళ్లు ఉపయోగకరంగా ఉండనున్నాయి. నిజామాబాద్ – సికింద్రాబాద్ రూట్‌లో ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఇక్కడి నుంచి రాజధానికి నిత్యం ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు రాకపోకలు సాగిస్తున్నా రు. సాధారణ రైలు సేవలతోపాటు అదనంగా సెమీ హైస్పీడ్, ర్యాపిడ్ ఇంటర్‌సిటీ తరహా రైళ్లను అందుబాటులోకి తేవాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే ఈ మార్గంలో విస్తరణ పనులు కొనసాగుతుండటం, రానున్న రోజుల్లో రైల్వే సర్వీసులు పెరుగుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ, ట్రాక్ సామర్థ్యానికి అనుగుణంగా హైస్పీడ్ నమో భారత్ రైలు సర్వీసులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్న విజ్ఙప్తులు వస్తున్నాయి.
రద్దీకి అనుగుణంగా పెరగని రైళ్ల సంఖ్య
నిజామాబాద్ – కాజీపేట మార్గం పూర్తయి దశాబ్దం
ఈ రూట్‌లో ప్రత్యేక రైలు నడిపించాలని వినతులు
హన్మకొండకు 20 నిమిషాలకు ఒక ఆర్టీసీ బస్సు
ఉత్తర తెలంగాణకు కీలక
జంక్షన్‌గా నిజామాబాద్
బస్సులపైనే పెరుగుతున్న భారం
ప్రస్తుతం నిజామాబాద్ నుంచి కరీంనగర్ మీదుగా హన్మకొండ వరకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు సర్వీసును ఆర్టీసీ నడుపుతోంది. అయినప్పటికీ ఈ మార్గంలో విపరీతమైన రద్దీ ఉంటోంది. పండగలు, వీకెండ్స్ వేళల్లో ప్రయాణికుల రద్దీ మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో రైల్వే సదుపాయాన్ని పెంచడం ద్వారా నిజామాబాద్ – వరంగల్ మధ్య కనెక్టివిటీ మరింత బలపడనుంది. ప్రస్తుతం బస్సులో వరంగల్ వరకు రూ.380 నుంచి రూ.400 వరకు చార్జీలు వెచ్చిస్తుండగా రైలులో రూ.100 ఖర్చుతో చౌకగా ప్రయాణించే వెసులుబాటు కలుగనుంది. ఈ రూట్‌లో ఉదయం వేళల్లో ప్రయాణించేందుకు వీలుగా మెము ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలని కోరుతూ రైల్వే ఫోరం సభ్యులు సంబంధిత అధికారులకు వినతులు అందజేశారు.
రిజర్వేషన్ బోగీలే అధికం
ప్రత్యేక మెమూ రైళ్లను నడపాలి..
నిజామాబాద్ నుంచి పెద్దపల్లి మీదుగా కాజీపేట మార్గంలో విపరీతమై న రద్దీ ఉంటోంది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌కు అనుగుణంగా రైల్వే సర్వీసులను పెంచాలి. ఈ మార్గంలో వీక్లీ రైలు మినహా నిత్యం నడిచే రైళ్లు లేవు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా మెము ఎక్స్‌ప్రెస్ రైలు నడపాలని కోరుతున్నాం.
– ఫణి, ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు
నిజామాబాద్ నుంచి పెద్దపల్లి మీదుగా కాజీపేట రైల్వే మార్గం పదేళ్ల కిందట అందుబాటులోకి వచ్చింది. ఈ రూట్‌లో నాందేడ్ నుంచి ధర్మవ రం, తిరుచానూరు వెళ్లే వీక్లీ రైలుతోపాటు జాల్నా ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు మాత్రమే పెద్దపల్లి, వరంగల్ మీదుగా నడుస్తున్నాయి. అయితే వీటిలో ఎక్కువగా రిజర్వేషన్ బోగీలే ఉండటంతోపాటు ఈ రైళ్లు కూడా వారంలో ఒకరోజు మా త్రమే రాత్రి వేళల్లో నడుస్తున్నాయి. నిజామాబాద్ – కరీంనగర్ – వరంగల్ మధ్య ప్రయాణి కుల రద్దీకి అనుగుణంగా మెము ప్రత్యేక ఎక్స్ ప్రెస్ రైలును నడిపించాలన్న డిమాండ్ ఉంది.


