పోలీసులమని చెప్పి.. బంగారం అపహరించి.. | - | Sakshi
Sakshi News home page

పోలీసులమని చెప్పి.. బంగారం అపహరించి..

Oct 7 2026 1:04 AM | Updated on Oct 7 2026 1:04 AM

పోలీసులమని చెప్పి.. బంగారం అపహరించి.. పంట ధ్వంసం ఘటనలో ఏడుగురిపై కేసు మహిళ అదృశ్యం కోళ్ల పందెం స్థావరంపై దాడి కాలువలో వృద్ధుడి మృతదేహం లభ్యం చిరుత సంచారం అవాస్తవం

బోధన్‌టౌన్‌: పట్టణ శివారులోని పోశమ్మ గుడి సమీపంలో ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని నమ్మించి మహిళ నుంచి ఎనిమిదిన్నర తులాల బంగారం, రూ. 2 వేల నగదు చోరీకి పాల్పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. సాలూర మండలంలోని సాలంపాడ్‌ క్యాంప్‌నకు చెందిన బిజ్జం తిరుపతమ్మ(65)కు అనారోగ్యంగా ఉండటంతో మరో మహిళతో కలిసి స్కూటీపై బోధన్‌కు బయలుదేరింది. మార్గమధ్యంలో పోశమ్మ గుడి వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి మేము పోలీసులమని, ఈ రోడ్డులో దొంగతనాలు జరుగుతున్నాయి.. బంగారం ఒంటి మీద వేసుకొని తిరగవద్దని చెప్పారు. ఒంటి మీద ఉన్న బంగారం, పర్సుతో పాటు కవరులో పెట్టి ఇస్తామని అనడంతో దుండగులను నమ్మిన తిరుపతమ్మ బంగారాన్ని వారి చేతికి ఇవ్వగా వారు మాయ చేసి ఉత్త కవర్‌ను ఆమె చేతిలో పెట్టారు. అనంతరం అక్కడి నుంచి ఉడాయించారు. అనంతరం అక్కడి నుంచి ఆస్పత్రికి చేరుకున్న మహిళకు పర్సు కనిపించకపోవడంతో మోసపోయాను గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ వెంకట నారాయణ తెలిపారు.

బోధన్‌: ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన రైతు కట్కూరి రామకృష్ణ పొలంలో చొరబడి వరి పంట ధ్వంసం, కరెంట్‌ బోరు ప్యానెల్‌ బోర్డుల చోరీ, బెదిరింపులకు పాల్పడిన ఘటన కేసులో ఏడుగురు వ్యక్తులపై మంగళవారం ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం. సాటాపూర్‌ గేట్‌ ప్రాంతంలో ఉన్న రైతు రామకృష్ణకు చెందిన వ్యవసాయ భూమిలో ఈ ఏడాది మే 9న ఎంఎస్సీ ఫారం గ్రామానికి చెందిన నలుగురు, ఇతర ప్రాంతాలకు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు ట్రాక్టర్లతో చొరబడి వరి పైరును ధ్వంసం చేసి, కరెంట్‌ బోరు, సీసీ కెమెరాను దొంగిలించారు.

బోధన్‌: వైద్య చికిత్స కోసం ఆస్పత్రి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన ఎడపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని నాందేవ్‌ వాడ–సుభాష్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మహిళ(30)కు పదేళ్ల క్రితం పెళ్‌లైంది. ఇద్దరు పిల్లలున్నారు. కుటుంబ తగాదాల కారణంగా కొంత కాలంగా ఎడపల్లి మండలంలోని ఆమె సోదరుడి వద్ద ఉంటోంది. సెప్టెంబర్‌ 30న చేతిపై దుద్దుర్లు వచ్చాయి. ఆస్పత్రికి వెళ్తానని నిజామాబాద్‌కు బయలుదేరి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. వెతికినా ఆచూకీ దొరకలేదు. మంగళవారం సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపారు.

మరో మహిళ..

వర్ని: మోస్రా మండల కేంద్రానికి చెందిన మహిళ(37) ఈ నెల 3 నుంచి కనపడటం లేదని వర్ని ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. నాటి నుండి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో మంగళవారం వర్ని పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసుకుని గాలింపు చేపట్టినట్లు ఎస్సై చెప్పారు.

బోధన్‌రూరల్‌: మండలంలోని పెంటాకుర్దు శివారులో కోళ్ల పందెం స్థావరంపై దాడి నిర్వహించినట్లు బోధన్‌ రూరల్‌ ఎస్సై రాజశేఖర్‌ మంగళవారం రాత్రి తెలిపారు. ఈ దాడిలో 17 ద్విచక్ర వాహనాలు, 10 పందెం కోళ్లను స్వాధీనం చేసుకుని 8 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసుల రాక గమనించిన మరికొంతమంది పరారయ్యారని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

వర్ని: తగిలేపల్లి శివారులోని నిజాంసాగర్‌ ప్రధాన కాలువలో వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. వివరాలు.. నస్రుల్లాబాద్‌ మండలం బొమ్మన్‌దేవ్‌పల్లి గ్రామానికి చెందిన బత్తుల సాయిలుగా గుర్తించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఆర్మూర్‌టౌన్‌: ఆర్మూర్‌ మండలం అంకాపూర్‌లోని యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ వద్ద చిరుతపులి సంచరిస్తోందంటూ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వార్తల్లో నిజం లేదని అటవీశాఖ బీట్‌ ఆఫీసర్‌ ప్రగతి తెలిపారు. స్కూల్‌ పరిసరాల్లో అధికారులు పరిశీలించగా చిరుతపులికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లభించలేదన్నారు. పులి సంచారమని వైరల్‌ అవుతున్న వీడియో ఏఐ ద్వారా క్రియేట్‌ చేసిందని అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement