కమ్మర్‌పల్లి: ఆటోలో పోగొట్టుకున్న ఓ బాధితురాలి పర్సును కమ్మర్‌పల్లి పోలీసులు సాంకేతిక సాయంతో గుర్తించి అందజేశారు. ఎస్సై సతీశ్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి చెందిన జులేఖా బేగం అనే మహిళ కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లిలోని తన బంధువుల వివాహానికి గురువారం రాత్రి ఆటోలో వస్తుండగా తన పర్సును పోగొట్టుకున్నారు. అందులో తులం బంగారు కమ్మలు, రూ. వెయ్యి నగదుతో పాటు ఒక సెల్ ఫోన్ ఉంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై సతీశ్ వెంటనే స్పందించి ఏఎస్సై వెంకట్‌కుమార్, కానిస్టేబుల్ దినేశ్‌తో కలిసి గాలింపు చేపట్టారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పర్సును ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం పీఎస్‌లో బాధితురాలికి పర్సుతోపాటు అందులోని బంగారు కమ్మలు, నగదు, సెల్ ఫోన్‌ను అందజేశారు. పర్సును తక్కువ సమయంలో గుర్తించి బాధితురాలికి అప్పగించడంలో సమర్థవంతంగా వ్యవహరించిన ఎస్సై సతీశ్, ఏఎస్సై, వెంకట్‌కుమార్, కానిస్టేబుల్ దినేశ్‌లను ఉన్నతాధికారులు అభినందించారు. అత్యవసర సమయాల్లో ప్రజలు ‘డయల్ 112’ సేవలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.


