● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
డిచ్‌పల్లి: అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి లేవనెత్తిన వ్యవసాయ ఆధారిత పరిశ్రమల ఏర్పాటు అంశంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న గుండారం–ఖానాపూర్ ప్రాంతంలో సుమారు 500 ఎకరాల భూమిని పరిశ్రమల ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా గుర్తించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై జిల్లా కలెక్టర్ ద్వారా ఫిజిబిలిటీ అధ్యయనం నిర్వహించి, సమగ్ర ప్రతిపాదనను సిద్ధం చేసి.. మంత్రికి సమర్పించినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే పేర్కొన్న అంశాలపై సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీధర్‌బాబు పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


