● సీపీ సాయిచైతన్య
కమ్మర్‌పల్లి: వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో జగిత్యాల, కోరుట్ల వైపు నుంచి నిజామాబాద్ వైపు తరలిస్తున్న భారీ గణేశ్ విగ్రహాలకు సంబంధించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సీపీ సాయి చైతన్య పోలీసులకు సూచించారు. కమ్మర్‌పల్లిలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్‌ను శుక్రవారం తనిఖీ చేశారు. ప్రతి భారీ గణేశ్ విగ్రహానికి సంబంధించిన వివరాలను పద్ధతిగా నమోదు చేయడంతో పాటు, విగ్రహాల తరలింపు సమయంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలుగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిర్వాహకులు విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు సహకరించాలని సీపీ కోరారు.
భీమ్‌గల్: పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ను సీపీ సాయి చైతన్య తనిఖీ చేశారు. సిబ్బందితో మాట్లాడి, పనితీరును క్షుణ్ణంగా తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారణ, గంజాయి నిర్మూలనకు తగిన చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బందిని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, భీమ్‌గల్ సీఐ పొన్నం సత్యనారాయణ గౌడ్, ఎస్సై తిరుపతి ఉన్నారు.


