తెయూ(డిచ్‌పల్లి): కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీలకు తగిన నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేస్తోందని తెయూ ఏబీవీపీ అధ్యక్షుడు సమీర్ విమర్శించారు. గురువారం రాష్ట్ర శాఖ పిలుపు మేరుకు తెయూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు వర్సిటీ పరిపాలనా భవనాన్ని ముట్టడించి నిరసన, ధర్నా నిర్వహించారు. అనంతరం రిజిస్ట్రార్ ఎం యాదగిరికి వినతిపత్రం అందజేశారు. ఏబీవీపీ అధ్యక్షుడు సమీర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీల అభివృద్ధి విషయంలో మొండి వైఖరిని అవలంబిస్తూ ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తోందన్నారు. వర్సిటీలకు సరైన నిధులు విడుదల చేయకుండా, బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయకుండా, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను కొనసాగిస్తూ ఫిక్స్‌డ్ డిపాజిట్లను కాజేయాలని కుట్ర పన్నుతుందని ఆరోపించారు. కార్యక్రమంలో వర్సిటీ ఏబీవీపీ కార్యదర్శి మోహన్, ఉపాధ్యక్షులు అనిల్, లెనిన్, నాయకులు విఘ్నేశ్, కిరిటి, ప్రీతం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


