● ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు
● ఒకరు మృతి.. ఇద్దరికి తీవ్రగాయాలు
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్నేహితుడిని ఎయిర్‌పోర్టులో దింపి తిరిగి ఇంటికి వస్తున్న కారు అదుపు తప్పి రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను బలంగా ఢీకొన్నది. దీంతో కారులో ఉన్న ముగ్గురిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్సై ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం మన్మద్ గ్రామానికి చెందిన పైడిపల్లి భోజన్న (47) దిలావర్‌పూర్ మండలం కంజర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్‌లో నివాసం ఉంటున్నారు. అదే కాలనీకి చెందిన స్నేహితులు గురుపల్లి గంగాధర్, మనోజ్ లతో కలిసి దుబాయికు వెళ్తున్న మరో స్నేహితుడు రాజేశ్వర్‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దింపడానికి బుధవారం రాత్రి రాజేశ్వర్ బంధువుకు చెందిన కారులో బయలుదేరారు. రాజేశ్వర్‌ను ఎయిర్‌పోర్టులో దింపి గురువారం ఉదయం తిరిగి నిర్మల్‌కు వస్తుండగా ఉదయం 10 గంటల సమయంలో డిచ్‌పల్లి వద్ద రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్‌ను కారు వెనుక నుంచి ఢీ కొన్నది. కారు డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న భోజన్న అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవింగ్ చేస్తున్న గంగాధర్, వెనుక సీట్లో కూర్చున్న మనోజ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో కారు మొత్తం ధ్వంసమైంది. డిచ్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య సంగీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


