కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు | - | Sakshi
Sakshi News home page

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు

Sep 11 2026 11:09 AM | Updated on Sep 11 2026 11:09 AM

ప్రభుత్వ సలహాదారు,

బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి

కందకుర్తి, యంచ పుష్కరఘాట్లు,

రోడ్ల పనులకు భూమి పూజ

రెంజల్‌/ నవీపేట: ఉత్తరప్రదేశ్‌ లో నిర్వహించిన కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి అన్నారు. రెంజల్‌ మండలం కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం, నవీపేట మండలం యంచ శివారులో నూతనంగా నిర్మించే పుష్కర ఘాట్‌, రోడ్డు పనులకు కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రాతో కలిసి గురువారం భూమి పూజ నిర్వహించారు. కందకుర్తి త్రివేణి సంగమ క్షేత్రం వద్ద అన్ని శాఖలకు సంబంధించి పనులకు సుమారు రూ.30 కోట్ల నిధులతో పుష్కర, ఘాట్‌, రోడ్డు పనులు, యంచలో రూ. 2.15 కోట్ల ఇరిగేషన్‌ నిధులతో నూతనంగా ఘాట్‌, రూ. 70 లక్షల పంచాయతీరాజ్‌ నిధులతో రహదారిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులకు భూమిపూజ, శంకుస్థాపనలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జూన్‌, జూలై మాసాల్లో నిర్వహించే గోదావరి పుష్కరాల సందర్భంగా పుణ్య స్నానాల కోసం జిల్లాలోని వివిధ పుష్కర క్షేత్రాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశాలున్నందున పుష్కర ఘాట్ల వద్ద సదుపాయాల కల్పన కోసం అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. అభివృద్ధి పనులను నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమాల్లో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌బిన్‌ హందాన్‌, డీసీసీ అధ్యక్షుడు నగేశ్‌రెడ్డి, బోధన్‌ ఆర్డీవో విజయకుమారి, తహసీల్దార్‌ శ్రావణ్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement