ఇప్పటివరకు అందిన దరఖాస్తులు
డొంకేశ్వర్(ఆర్మూర్) : జిల్లాలో చేయూత పింఛన్ల కోసం వచ్చిన దరఖాస్తుల వడపోతకు అధికారులు రంగం సిద్ధం చేశారు. దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించడానికి నాలుగైదు రోజుల్లో గ్రామాలు/వార్డుల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఆయా శాఖల మండల అధికారులను నియమించారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు హైదరాబాద్ సెర్ప్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చారు. అధికారులు నేరుగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి అర్హతలను నిష్పక్షపాతంగా క్రాస్‌చెక్ చేయనున్నారు. క్షేత్రస్థాయిలో సేకరించిన నిజమైన వివరాలను అక్కడిక్కడకే అధికారి ‘చేయూత’ మొబైల్ యాప్‌లో నమోదు చేస్తారు. ఇందుకోసం అధికారులకు యాప్‌కు సంబంధించిన లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌లు సైతం ఇచ్చారు. దరఖాస్తుదారు ఆదాయం, రేషన్‌కార్డు, సాగుభూమి ఉందా, కుటుంబంలో ఎవరికై నా ప్రభుత్వ ఉద్యోగం ఉందా, వృత్తి ఏమిటి తదితర వివరాలు యాప్‌లో అవును/కాదు ఆప్షన్‌ల రూపంలో ఉన్నాయి. అధికారులు ఆప్షన్లను ఎంచుకోగానే చివరగా వెరిఫికేషన్ చేస్తున్న ఫొటోను అప్లోడ్ చేయగానే రిపోర్టు మొత్తం సెర్ప్ లాగిన్‌లోకి వెళ్తుంది. క్రాస్ చెక్ పూర్తయిన తర్వాత సెర్ప్ అధికారులు కూడా 360డిగ్రీ సాఫ్ట్‌వేర్‌తో అసలైన లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మొత్తాన్ని ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలించారు. ఈ నెల 15వ తేదీతో పింఛన్ల దరఖాస్తుకు గడువు తేదీ ముగియనుండగా, వెంటనే క్షేత్రస్థాయి పరిశీలన ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
మండల స్థాయి అధికారులతో
దరఖాస్తుల పరిశీలన
ఇళ్ల వద్దకే వెళ్లనున్న ఆఫీసర్లు
ప్రత్యేక యాప్ ద్వారా అర్హుల గుర్తింపు
ఈ నెల 25లోగా పూర్తి చేయాలని ఆదేశాలు


