నీటి వనరులు వృథా కానివ్వొద్దు | - | Sakshi
Sakshi News home page

నీటి వనరులు వృథా కానివ్వొద్దు

Sep 11 2026 8:16 AM | Updated on Sep 11 2026 8:16 AM

ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌ రెడ్డి

నిజామాబాద్‌ అర్బన్‌: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం నెలకొని ఉన్న ప్రస్తుత తరుణంలో అందుబాటులో ఉన్న నీటి వనరులు వృథా కాకుండా నిరంతరం పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్‌ రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్‌ భవేశ్‌మిశ్రాతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ జలాశయాలలో అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై ఇరిగేషన్‌ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతేడాదితో పోలిస్తే శ్రీరాంసాగర్‌ సహా ఇతర ప్రాజెక్టులలో అతి తక్కువ నీటి నిల్వలు ఉన్నాయన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని చుక్క నీరు సైతం వృథా కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. తాగునీటి అవసరాలకు నీటిని నిలువ ఉంచుతూ, పంటలను కాపాడేందుకు వీలుగా రెండు తడుల వరకు సాగు నీటిని విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. నిజాంసాగర్‌, శ్రీరాంసాగర్‌ జలాలు చివరి ఆయకట్టు వరకు చేరేలా గట్టి నిఘా ఉంచాలన్నారు. రైతుల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలలో ఏమాత్రం రాజీ పడబోమని, నీటి వృథా జరిగి పంటలు ఎండితే సంబంధిత అధికారులను బాధ్యులుగా పరిగణిస్తామని తేల్చి చెప్పారు. నీటి వృథాను నిలువరించేందుకు అవసరమైన చోట కాలువలు, తూముల మరమ్మతులు వంటి పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, పనులకు కావాల్సిన నిధులను సమకూరుస్తామని సుదర్శన్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఖరీఫ్‌ పంట సేకరణకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వీలుగా గోదాములలో నిలువ ఉన్న బియ్యం నిల్వలను నిర్దేశిత ప్రాంతాలకు వేగంగా తరలించాలని సూచించారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో చదువుకుంటున్న బాలబాలికలకు ఏకరూప దుస్తులను త్వరితగతిన అందించాలని సూచించారు.

సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌ తాహెర్‌ బిన్‌ హందాన్‌, డీఆర్వో గీత, జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌, డీఆర్డీవో సాయన్న, పౌర సరఫరాల శాఖ అధికారి అరవింద్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement