బోధన్ రూరల్: సాలూర మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో సాలంపాడ్ గ్రామానికి చెందిన బొర్ర గంగారాం(45) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బోధన్ రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గంగారాం కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. బుధవారం రాత్రి బైక్‌పై సాలూర–బోధన్ రహదారిపై ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు బైక్‌పై నుంచి పడి మృతి చెందాడు. రహదారిపై ఇసుక కుప్పలు వేయడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ మృతుడి కుటుంబీకులు, బంధువులు రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ఎస్సై రాజశేఖర్ ఘటన స్థలానికి చేరుకొని చట్టపరంగా చర్యలు తీసుకొని న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతుడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
ఒకరి అదృశ్యం
నిజామాబాద్‌అర్బన్: రైలులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అదృశ్యమైనట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన బాలాజీ బాబురావు ఈనెల 7న తిరుపతి నుంచి నాందేడ్ రైలులో ప్రయాణిస్తున్న సమయంలో నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో దిగి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. అతని ఆచూకీ తెలిసిన వారు 8712658591 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
● 98 రకాల పక్షులు స్వాధీనం
నిజామాబాద్ రూరల్: మండలంలోని మల్లారం, మాలపల్లి ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. మాలపల్లిలో ఉన్న ఓ అక్వేరియం, పెట్ దుకాణంలో అక్రమంగా ఉంచి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న 98 రకాల పక్షులను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సయ్యద్ కలీం, సయ్యద్ బిన్ ఖాలీద్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పక్షులను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. ఎవరు సరఫరా చేస్తున్నారు అనే అంశాలపై విచారణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.


