వీడియోలతో మాయాజాలం!? | - | Sakshi
Sakshi News home page

వీడియోలతో మాయాజాలం!?

Sep 10 2026 1:33 AM | Updated on Sep 10 2026 1:33 AM

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ప్రభుత్వం ఎన్ని పకడ్బందీ విధానాలు తీసుకొచ్చినా వీబీజీ రామ్‌జీ (ఉపాధిహామీ) పథకంలో అవినీతికి అడ్డుకట్ట పడడం లేదని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు అక్రమాలకు పాల్పడకుండా దారులన్నీ మూసినప్పటికీ ఏదో ఒక విధంగా కొత్త ద్వారాలను తెరుస్తున్నారు. జిల్లాలో కొందరు పటిష్టమైన యాప్‌లను సైతం బురిడీ కొట్టించి కూలీలకు దొంగ హాజరు వేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పారదర్శకత కోసం ప్రభుత్వం ఇటీవల తెచ్చిన నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎన్‌ఎంఎంఎస్‌) యాప్‌లో సాంకేతిక లొసుగులను ఆసరా చేసుకుని కూలీలు పనులకు రాకపోయినా హాజరు వేస్తున్నారనే విమర్శలున్నాయి. నిబంధనల ప్రకా రం పనులు జరుగుతున్న ప్రదేశంలో కూలీల ముఖచిత్రాన్ని లైవ్‌లో క్యాప్చర్‌ చేసి యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనను కొందరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు చాకచక్యంగా పక్కదారి పట్టిస్తున్నట్లు తెలిసింది. ముందుగా తీసిపెట్టుకున్న వీడియోలను పని ప్రదేశంలో యాప్‌ ఓపెన్‌ చేసి ప్లే చేస్తూ ఫొటోలు క్యాప్చర్‌ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విధంగా పనులకు రాకుండానే దొంగ హాజరు వేయిస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లు, ఆ తర్వాత సదరు కూలీల బ్యాంకు ఖాతాల్లో డబ్బు లు పడగానే రంగంలోకి దిగుతున్నారు. కూలీలకు సమాచారం ఇచ్చి మొత్తం డబ్బులో సింహభాగాన్ని వాటా రూపంలో తీసేసుకుంటున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

పని చేయకుండానే డబ్బులు వస్తుండడంతో కొందరు కూలీలు సైతం ఈ అక్రమ సంపాదనకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. సాంకేతికతను సైతం తలదన్నేలా సాగుతున్న ఈ సరికొత్త అవినీతి దందాపై ఇప్పటి వరకు అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. యాప్‌లో ఫొటోలు అప్‌లోడ్‌ అవుతుండడంతో అంతా సవ్యంగానే సాగుతోందని అధికారులు భావిస్తున్నారు.

నవీపేట్‌ మండలంలోని ఓ గ్రామ పంచాయతీకి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పనులు చేస్తున్నప్పుడు పలువురు కూలీల వీడియోలను తీసి వారు పనికిరాని సమయంలో యాప్‌లో వాటిని ఫొటో క్యాప్చర్‌గా మార్చినట్లు సమాచారం. ఇటీవల ఓ మహిళా కూలీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కాగా, డబ్బులను తిరిగి ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు అందజేసింది. జిల్లాలో మరికొందరు ఫీల్డ్‌ అసిస్టెంట్లు సైతం ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

యాప్‌నే బురిడీ కొట్టిస్తున్న కొందరు

ఫీల్ట్‌ అసిస్టెంట్లు

కూలీలు రాకపోయినా వీడియో

క్లిప్పింగులతో హాజరు?

ఖాతాల్లో డబ్బులు పడగానే

వాటాల వసూళ్లు

ఎన్ని విధానాలు వచ్చినా

క్షేత్రస్థాయిలో ఆగని అవినీతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement